ఈ మధ్య రాజీనామా అంటూ హడావుడి చేశారు అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి! తన ప్రాంత ప్రజల ఈతిబాధలు తీర్చలేకపోతున్నాననీ, వారి సమస్యలు పరిష్కరించలేనప్పుడు పదవిలో ఉండి ఉపయోగం ఏముందనే బాధతోనే రాజీనామా చేయబోతున్నట్టు ప్రకటించి, హడావుడి చేశారు. అయితే, వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించడంతో జేసీ వెనక్కి తగ్గారు. ఇదే విషయమై తాజాగా మరోసారి విలేకరులు ఆయన ముందు ప్రస్థావిస్తే… ప్రతిపక్ష నేత జగన్ కు ఉచిత సలహా ఒకటి ఇచ్చారు! ఒక శ్రేయోభిలాషిగా జగన్ మేలు కోరే ఈ మాట చెబుతున్నా అన్నారు.
ప్రజలకు ఉపయోగపడనప్పుడు ఈ ఎంపీ పదవి ఎందుకనీ, రాజీనామా చేస్తే మరో మహానుభావుడు వచ్చి ప్రజల బాధలు తీరుస్తాడనే అనుకున్నా అన్నారు! కానీ, ముఖ్యమంత్రి వెంటనే స్పందించారు, ఈ ప్రాంతానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడంతో తాను వెనక్కి తగ్గాననీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు కూడా తెలిపానని జేసీ చెప్పారు! ఆ తరువాత జగన్ గురించి మాట్లాడుతూ.. ‘వద్దు బాబూ.. నువ్వు మా ఫ్రెండ్ కొడుకువీ. ఈ ఈతి బాధలు నీకు ఎందుకూ? అవేంటో(కేసులు) ఉన్నాయట.. పదో పన్నెండో నాకు సరిగ్గా తెలీదు, అవి వదిలించుకుని.. హాయిగా భార్యా బిడ్డలతో ఉండు’ అంటూ సలహా ఇచ్చారు. రాజకీయాలకు దూరంగా ఉండాలంటూ ఒక శ్రేయోభిలాషిగా సలహా ఇస్తున్నాను అన్నారు. వ్యాపారాలు చూసుకుంటూ, భార్యా పిల్లలతో సంతోషంగా గడుపు అని చెప్పారు. ప్రస్తుతం రోజా సైలెంట్ అయ్యారనీ, తరువాత సాయిరెడ్డి సైలెంట్ అవుతారనీ, చివరిగా మావాడు (జగన్) కూడా సైలెంట్ అవుతారని జేసీ జోస్యం చెప్పారు!
జేసీ రాజీనామా డ్రామాకు ఎందుకు తెర లేపారో అందరికీ తెలిసిందే! హటాత్తుగా ప్రజల సమస్యలు గుర్తొచ్చేసి కలిగిన బాధేం కాదు, అనంత టీడీపీలో తన ఉనికిని చాటుకోవడమే ఆయన వ్యూహం! టీడీపీలోకి ఆయన వచ్చిన దగ్గర నుంచీ పరిటాల వర్గం అసంతృప్తితోనే ఉంటూ వచ్చింది. ముఖ్యమంత్రి సర్ది చెబుతూ ఉండటంతో వాతావరణం పైపైకి ప్రశాంతంగా కనిపిస్తూ ఉంది. ఈ మధ్య అనంత టీడీపీలో ఒక సామాజిక వర్గ నేతల ఆధిపత్యం పెరుగుతోందని జేసీ భావించడం, వారికే కొన్ని కీలక కాంట్రాక్టు పనులు దక్కాయనే ఆవేదన.. జేసీ రాజీ డ్రామా వెనక ఉన్నాయని కొంతమంది అభిప్రాయపడ్డారు. వీటిని ప్రజా సమస్యలు అనే ఫ్లేవర్ వేసి.. రాజీనామా అన్నారు. సరే.. జగన్ కు సలహాలు ఇస్తున్న జేసీకి, ప్రజలపై అంత ప్రేమే ఉప్పొంగిపోయి, వారి కష్టాలకు కరిగిపోయి ఉంటే.. రాజీనామా చేసెయ్యాల్సింది. ఆ తరువాత మాట్లాడితే అందరూ హర్షించేవారు. ఈ ట్రాక్ రికార్డ్ ఉంచుకుని… ఇతరులకు నీతులు చెబితే, వినడానికి ఏమంత బా..గో..దు.. అనేది కొందరి స్పందన!