తెదేపా ఎంపీ రాయపాటి సాంభశివరావు తన నియోజక వర్గంలో పెండింగ్ పనులను ప్రభుత్వం తక్షణమే పూర్తి చేయకపోతే తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని బెదిరించారు. తన నియోజకవర్గంలో నర్సారావు పేట, వినుకొండ మరియు మాచెర్ల ప్రాంతాలలో త్రాగునీటి పధకాలకు అనుమతులు మంజూరు చేయమని ఎన్నిసార్లు కోరినా అధికారులు పట్టించుకోవడంలేదని వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకి పిర్యాదు చేసారు. ఇప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోతే తను రాజీనామా చేస్తానని హెచ్చరించారు.
పెడన తెదేపా ఎమ్మెల్యే కాగిత వెంకట రావు కూడా అలాగే బెదిరించారు. తన నియోజక వర్గంలో పొలాలకు సాగునీరు అందించమని సాగునీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎన్ని సార్లు అడిగినా ఆయన తన అభ్యర్ధనని పట్టించుకోలేదని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకి పిర్యాదు చేసారు. ఒకవేళ ఇప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు. తనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో, మంత్రులతో గానీ ఎటువంటి విభేదాలు లేవని కానీ తన మాటకు విలువలేనప్పుడు ఇంకా ఎమ్మెల్యేగా కొనసాగడం అనవసరమని భావిస్తున్నానని వెంకటరావు అన్నారు. తన అభ్యర్ధనపై ముఖ్యమంత్రి ప్రతిస్పందన చూసిన తరువాత రాజీనామాపై తగిన నిర్ణయం తీసుకొంటానని మంత్రి పుల్లారావుకి చెప్పారు. వారి అభ్యర్ధనలపై మంత్రి పుల్లారావు స్పందిస్తూ తక్షణమే ఈ సమస్యలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చేరు.
అధికార పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలకే ఇటువంటి పరిస్థితి ఉంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో ఊహించడం కష్టం. దేశంలో గుజరాత్ తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యాపారానికి అత్యంత అనుకూలమయిన రాష్ట్రమని ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది. కానీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ నియోజక వర్గంలో చిన్న చిన్న పనులు చేయించుకొనేందుకు రాజీనామాలు చేస్తామని ప్రభుత్వాన్ని బెదిరించవలసి రావడం చూస్తుంటే వాస్తవ పరిస్థితులు ఏవిధంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చును. పార్టీలో, ప్రభుత్వంలో నేతలకు, ప్రజా ప్రతినిధులకు, మంత్రులకు మధ్యన నెలకొన్న విభేదాలు, బేషజాల వలన అభివృద్ధి పనులు జరుగకపోతే అంతిమంగా తెదేపాయే దానికి మూల్యం చెల్లించవలసి వస్తుంది.