హైదరాబాద్: ఉచితంగా లభించే మద్యం, మాంసాహారం, సెలవులను ఎంజాయ్ చేయటానికే యువత సైన్యంలో చేరుతున్నారంటూ కొద్దిరోజులక్రితం వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెలుగుదేశం నాయకుడు, అమలాపురం ఎంపీ పందుల రవీంద్రబాబు మళ్ళీ తేనెతుట్టెను కదిలించారు. హిందూ సంస్కృతి, సంప్రదాయాలపై, హిందూ మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
కాకినాడలో ఒక ప్రైవేట్ పాఠశాలలో ఏర్పాటుచేసిన జిల్లా సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి హాజరైన రవీంద్రబాబు, వినాయక చవితి, దీపావళి పేరుతో నీటిని, వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని మండిపడ్డారు. ఇటువంటి పండుగలు భారతదేశంలో ఉండటం దురదృష్టకరమని అన్నారు. మతంపేరిట బాబాలు, మాతాజీలు అనేక మోసాలకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు. వాళ్ళదగ్గరకు వెళ్ళి చాలామంది డబ్బులు పోగొట్టకున్నారని, మహిళలు తమ క్యారెక్టర్ పోగొట్టుకున్నారని అన్నారు. హోలీ పండుగరోజు అతిగా రంగులు పులుముకోవటంవలన అనారోగ్య పరిస్థితులు తలెత్తుతాయని చెప్పారు. ప్రాంతీయ, కుల, మత తత్వాల కారణంగా సాంకేతిక పరిజ్ఞానం చెందాల్సినంత అభివృద్ధి చెందలేదన్నారు. ఇస్రో రాకెట్ ప్రయోగాలకుముందు తిరుపతికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టటాన్ని అవహేళన చేశారు. రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నందువల్ల పండుగలను, వాటికి ఖర్చును కంట్రోలే చేసుకోవాలని సూచించారు.
కేంద్ర విమానయానశాఖమంత్రి అశోక్ గజపతిరాజు తాను అగ్గిపెట్టె జేబులో పెట్టుకునే విమానాలలో ప్రయాణిస్తానని చేసిన వ్యాఖ్యలపై గత మార్చినెలలో టైమ్స్‌నౌ ఛానల్లో జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న రవీంద్రబాబు, డిఫెన్స్ సిబ్బందికి ఉచితమద్యం, ఉచిత మాంసాహారం, సెలవులు అన్నీ ఉంటాయని వ్యాఖ్యానించారు. దీనిపై చర్చను నిర్వహిస్తున్న జర్నలిస్ట్ అర్ణబ్ గోస్వామి రవీంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఈ వ్యాఖ్యలు కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన తర్వాత మాజీ సైనికులు, అనేక మాజీ సైనిక సంఘాలవారు రవీంద్రబాబు వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనలు నిర్వహించారు. సోషల్ మీడియాలోకూడా ఇది పెద్ద వివాదంగా మారింది. ఇది అంతకంతకూ తీవ్రరూపం దాల్చటంతో చంద్రబాబు రంగంలోకి దిగి రవీంద్రబాబు వ్యాఖ్యలతో తమ పార్టీకి, ప్రభుత్వానికి సంబంధంలేదని, సైనికులంటే తమకు ఎంతో గౌరవం ఉందని ప్రకటన జారీ చేశారు. రవీంద్రబాబుపై అంతర్గతంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రవీంద్రబాబు మీడియాముందుకు వచ్చి, తన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పారు. తన వ్యాఖ్యలు తప్పనిపిస్తే క్షమాపణ చెప్పటానికి తాను సిద్ధమన్నారు. తాను నచ్చలేదో, తన ఫేస్ నచ్చలేదోగాని పనిగట్టుకుని తనపై రాజకీయాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి రవీంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఆయన అమాయకత్వమో, అహంకారమో తెలియటంలేదు. ఐఆర్ఎస్లో కస్టమ్స్ అధికారిగా ఉండి బాగా గడించి ఉన్న డబ్బుతో – ప్రజలకుకూడా ఏదైనా సేవచేద్దామని ఎన్నికలకుముందే రవీంద్రబాబు రాజకీయాలలోకి ప్రవేశించారు. హిందువులు మెజారిటీ కాబట్టి ఎన్ని మాటలన్నా నడిచిపోతుందికానీ, అదే మరొకరిని అంటే ఈపాటికి పెద్ద గొడవైపోయి ఉండేది.
ఒకవైపు అనంతపురం ఎంపీ జేసీ దివాకరరెడ్డి ప్రత్యేకహోదాపై పార్టీని ఇబ్బందిపెట్టేలాగా వ్యాఖ్యలు చేస్తుండగా, ఇటు రవీంద్రబాబు పార్టీని మరోవిధంగా ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. చంద్రబాబు వీరిని అదుపుచేయలేకపోతే పార్టీకి మరిన్న తలవంపులు తప్పవు.