మన నాయకులకు రకరకాల అంటు వ్యాధులు ఉంటాయి. వాటిని ఎవరో అంటించి ఉంటారు. ఇవేవో బాగానే ఉన్నాయి కదా అని చెప్పి ఇప్పటి తరం నాయకులు కూడా వాటిని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అలాంటి వాటిల్లో ప్రధానమైన ఒక వ్యాధి అప్పటి వరకూ పదవులు కట్టబెట్టి రాజకీయ జీవితాన్నిచ్చిన పార్టీపైన ఇష్టం వచ్చినట్టుగా బురదజల్లడం ఒకటి. ఈ బురద జల్లుడు కార్యక్రమాన్ని నభూతో అనే స్థాయిలో నడిపించిన ఒక ప్రముఖ నాయకుడు పరకాల ప్రభాకర్. చిరంజీవి పుణ్యమాని ఈయనగారికి చాలా చాలా పాపులారిటీ వచ్చింది. చిరంజీవి కూడా పరకాల స్థాయిని మించే ఆదరించాడు. కానీ పరకాల మాత్రం తిన్న ఇంట్లోనే కక్కాడు. ప్రజారాజ్యం పార్టీ ఆఫీసులోనే చిరంజీవిపైన ఘాటు విమర్శలు చేశాడు. ఇక ఇలాంటి బాపతు నాయకులు ఇంకా ఎందరో.
ఇప్పుడు ఇదే కోవలో చిత్తూరు ఎంపి శివప్రసాద్ కూడా చేరుతున్నట్టున్నాడు. ఏళ్ళ తరబడి టిడిపి ఎంపిగా కొనసాగుతున్న ఈయనగారికి ఇప్పుడు సడన్గా టిడిపిలో ఎస్సీఎస్టీలకు న్యాయం జరగడం లేదన్న విషయం గుర్తొచ్చింది. చంద్రబాబు నాయుడు ఎస్సీ ఎస్టీలకు పదవులు ఇచ్చే విషయంలో దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడన్న ఆలోచన వచ్చింది. అంతే మాంచి టైమింగ్ చూసుకుని అంబేద్కర్ జయంతి రోజు ఇష్టం వచ్చినట్టుగా వాగేశాడు. మరి ఇన్ని సంవత్సరాలుగా ఈ మాటలు ఎందుకు చెప్పలేదు? ఆ మధ్య తిరుపతిలో జరిగిన ఓ సభలో ఇదే చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశాడు శివప్రసాద్. మరి ఇంతలోనే అంత మార్పు ఏం కనిపించింది. ఈయన త్వరలో పార్టీ మారతాడు అని చెప్తున్న పార్టీ నాయకుడు మాత్రం ఎస్సీ ఎస్టీలకు చంద్రబాబుకంటే ఎక్కువ న్యాయం ఏం చేశాడు? ఐదేళ్ళ తర్వాత ఆ పార్టీ నుంచి కూడా జంప్ అయ్యే పరిస్థితి వస్తే అప్పుడు ఆ పార్టీని కూడా ఇదేలా విమర్శిస్తాడు శివప్రసాద్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఇలాంటి నాయకులందరూ కూడా జంపింగ్ జపాంగ్స్, జోకర్స్లానే బిహేవ్ చేస్తున్నారు. మరి ఈ జంపర్స్కి వచ్చే ఎన్నికల్లో అయినా ప్రజలు సరైన బుద్ధి చెప్తారేమో చూడాలి. ఎందుకంటే ఈ జంపింగ్ నాయకులందరికీ కూడా వ్యక్తిగత స్వార్థం తప్ప ప్రజాప్రయోజనాలు అస్సలు పట్టవు కాబట్టి.