తరచూ చిత్ర, విచిత్ర వేషధారణలతో వివిధ అంశాలపై తన నిరసనను తెలుపుతూ అందరి దృష్టిని ఆకట్టు కొనే ప్రయత్నంతో పాటు వినోదం కూడా కలిగించే క్యారెక్టర్ సినీ నటుడిగా ఉంటూ రాజకీయ రంగ ప్రవేశం చేసిన తెలుగు దేశం యంపీ డా. ఎన్ శివప్రసాద్ నిరసన నేడు బిజెపి ని ఇరకాటంలో పడవేసింది.
బిజెపి నాయకత్వంలోని ఎన్డీయే లో తెలుగు దేశం కీలక భాగస్వామి కావడంతో పాటు, ఏంతో నమ్మకంతో నోట్ల రద్దు తో ఏర్పడిన పరిస్థితులపై టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అధ్యక్షతన ముఖ్యమంత్రిల కమిటీని కేంద్రం ఏర్పాటు చేసిన రోజుననే ఆయన ఈ నిరసన తెలపడం అందరికి విస్మయం కల్గించింది.
రిజర్వు బ్యాంక్, బ్యాంక్ ల పనితీరుపట్ల ముందురోజు తీవ్రంగా ఆగ్రవేశాలు వ్యక్తం చేసిన చంద్రబాబునాయుడు కూడా ఈ కమిటీని ఏర్పాటు చేయగానే మాట మార్చే ప్రయత్నం చేశారు. బ్యాంక్ లను అవమాన పరచడం తన ఉద్దేశ్యం కాదని అంటూ సరిదిద్దుకొనే ప్రయత్నం చేశారు. అటువండిది పార్టీ యంపీ పార్లమెంట్ లో ఈ విధంగా చేయడంతో విస్మయం చెందుతున్నారు.
లోక్ సభ లో మొత్తం ప్రతిపక్షం గందరగోళ పరిస్థితులను కలిగిస్తూ, సభను జరగనీయకుండా అడ్డుకొంటున్న సమయంలో సగం నలుపు, మిగిలిన సగం తెలుపు రంగులో షర్ట్ వేసుకొనే సభలోకి వచ్చిన శివప్రసాద్ నేరుగా ముందువరసలో ఉన్న ప్రతిపక్ష నేతల వద్దకు వెళ్లారు. నోట్ల రద్దుతో ఏర్పడిన సమస్యల పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తన డ్రెస్ కు భాష్యం కాంగ్రెస్ పక్ష నాయకుడు మల్లిఖార్జున ఖర్గే కు వివరించారు.
ఆయన కొంటెగా అధికారపక్షం నాయకుల వద్దకు వెళ్ళమని చెప్పగానే, వెంటనే వెళ్లి ఎల్ కె అద్వానీ, అనంతకుమార్ వంటి వారి వద్దకు వెళ్లి నమస్కారం పెట్టారు. ఆయన తాను షర్ట్ పై ఒక వంక ప్రజలు పడుతున్న ఇబ్బందులను, మరో వంక నల్లధనం ప్రమాదాన్ని వివరించే ప్రయత్నం చేసిన్నట్లు తెలిపారు.
తరువాత సభ బయట మాట్లాడుతూ వారం రోజుల పాటు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూర్ నియోజకవర్గం అంతా తిరిగితే తనకు ప్రజలు ఏడుస్తూ కనిపించారని, నోట్ల రద్దుకు వ్యతిరేకంగా మాట్లాడానికి కూడా భయపడుతున్నారని పేర్కొన్నారు. రైతులు `మరణావస్థలో’ ఉన్నారని అన్నారు.
పైగా నేరుగా ప్రధానమంత్రి పైననే ఆయన విమర్శల బాణం వదిలారు. “చుట్టూ చేరిన కొద్దీ మంది ప్రధానమంత్రికి తప్పుడు సమాచారం ఇస్తున్నారు” అని వాపోయారు. ఏమాత్రం ముందు చర్యలు తీసుకోకుండా నోట్ల రద్దు ప్రకటించారని నిందిస్తూ “నేను ఒక సినిమా తీయాలి అనుకొంటే ముందుగా కధ, సహకార సిబ్బంది, నటులు, డైరెక్టర్ ను ఎన్నుకుంటాను. కేవలం ఒక కెమెరా తీసుకొని చిత్రీకరించే ప్రయత్నం చేయను. అయితే ప్రధానమంత్రి తగు ఏర్పాట్లు చేయలేదు” అంటూ విచారం కూడా వ్యక్తం చేశారు.