2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి చంద్రబాబు చేసినన్ని ప్రమాణాలు, చేయించినన్ని ప్రమాణాలు వేరే ఏ ముఖ్యమంత్రీ చేయించలేదేమో. కానీ ఆ ప్రమాణాలన్నీ కూడా చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీల్లానే తయారవుతున్నాయి. పదేళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చినందుకో ఏమో తెలియదు కానీ టిడిపి నాయకులందరూ కూడా మానవతీతులం అనే స్థాయిలో ఫీలవుతున్నట్టున్నారు. అఫ్కోర్స్…ఈ నాయకుల తీరుకు ప్రతిపక్ష నాయకుడు జగన్ కూడా ఏమీ తగ్గడనుకోండి. కానీ ప్రతిపక్ష నేత జగన్ తప్పులను మాత్రం కనీవినీ ఎరుగని స్థాయిలో హైలైట్ చేయాలని చూస్తుంటారు చంద్రబాబు, ఆయన భజన మీడియా బృందం. బస్సు ప్రమాదంలో మృతిచెందిన బాధితుల పక్షాన జగన్ చేసిన హడావుడిని ఓ రేంజ్లో హైలైట్ చేశారు. అధికారుల విషయంలో జగన్ చేసిన తప్పును ప్రజలందరికీ తెలిసేలా చేశారు. టిడిపి నాయకులు, మీడియా చేసిన ఓవర్ యాక్షన్ విషయం పక్కనపెడితే జగన్ చేసింది మాత్రం కచ్చితంగా తప్పే.
బాధితుల తరపున ప్రశ్నించే సందర్భంలో జగన్ ఆవేశపడిపోతేనే దానిని చాలా పెద్ద తప్పుగా చిత్రీకరించారు. మరి సొంత బిజినెస్ల కోసం టిడిపి నాయకులు రెచ్చిపోతే చంద్రబాబు మాట్లాడరా? చంద్రబాబు హెచ్చరించాడు అని చెప్పి ఆయన భజన మీడియాలో చెప్పడం తప్పితే ప్రజల ముందుకు వచ్చి జరిగిన విషయం గురించి మాట్లాడకపోవడం ఏంటి? అసలే చంద్రబాబు పార్టీలో ఉన్నంతమంది వ్యాపారస్థులు వేరే ఏ పార్టీలోనూ ఉండరు. మరీ ముఖ్యంగా ట్రావెల్స్ బిజినెస్ మొత్తం కూడా చంద్రబాబు పార్టీనేతల చేతుల్లోనే ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఆ వ్యాపారస్తులు ఆర్టీసీకి ఏ స్థాయిలో నష్టం చేస్తున్నారో….ప్రత్యర్థి వ్యాపారస్తులను దెబ్బకొట్టడం కోసం ఏ స్థాయిలో అధికారాన్ని వాడుకుంటున్నారో చంద్రబాబుకు తెలియదా? అయినా ఓ బస్సు ప్రమాదంలో పదిమంది చనిపోతే…..బాధితుల తరపున కాకుండా, బస్సు ఓనర్ తరపున వకాల్తా పుచ్చుకున్న ప్రభుత్వం ప్రజలకు ఏం సందేశం ఇస్తుంది? ట్రావెల్స్ బిజినెస్ ఉన్న టిడిపి ఎంపి కేశినేని నాని రవాణా శాఖ కమిషనర్ని ఆ స్థాయిలో దుర్భాషలాడడం ఏంటి? అధికారుల చేత సక్రమంగా పనిచేయించడం కోసమే అలా చేశానని చెప్పి సమర్థించుకోడం ఏంటి? వ్యాపారస్థుడు ఎప్పుడూ కూడా లాభాలనే కోరుకుంటాడు. పోటీ ఉండకూడదనుకుంటాడు. ఇప్పుడు కేశినేని నాని తాపత్రయం కూడా అదేనన్న విషయం చంద్రబాబుకు తెలియదా? 2014లో టిడిపి ఎన్నికల ఖర్చు కోసం ఇలాంటి వ్యాపారస్థులందరూ ఏ స్థాయిలో పెట్టుబడులు పెట్టారో తెలియదు కానీ ….ఇప్పుడు మాత్రం ప్రపంచంలోనే గొప్ప అడ్మినిస్ట్రేటర్ని అని చెప్పుకునే చంద్రబాబు పరువు మాత్రం పూర్తిగా తీసేస్తున్నారు.
టిడిపి నేతలు అధికారులపైన బూతులతో రెచ్చిపోతున్న సందర్భాల్లో చంద్రబాబు స్పందన కూడా ఆ దాడులను రెచ్చగొట్టేలానే ఉంటోంది. ఆయన భజన మీడియాలో వార్నింగ్ ఇచ్చాడు, నాయకులను బెదరగొట్టాడు లాంటి వార్తలు రాయించుకోవడం తప్పితే ప్రత్యక్షంగా మీడియా ముందుకు వచ్చి….మా నాయకులు చేసింది తప్పు. ఇలాంటి తప్పులు ఇంకెవ్వరు చేసినా క్షమించేది లేదు అన్న మాటలు చెప్పలేకపోతున్నాడు. అధికారులకు మనోధైర్యం ఇవ్వలేకపోతున్నాడు. టిడిపి నేతలు రెచ్చిపోతుంటే అడ్డుకోలేకపోతున్నాడు. పైగా టిడిపి నేతలు చెప్పినట్టు వినాల్సిందే అని చెప్పి అధికారులకు హుకుం జారీ చేస్తున్న విషయం కూడా కంటికి కనిపిస్తున్న వాస్తవం. రాజ్యాంగం పైన చేసిన ప్రమాణాలకే దిక్కులేనప్పుడు…ఇక అసెంబ్లీలో చంద్రబాబు చేయించే ఉత్తుత్తి ప్రమాణాలతో ప్రజలకు ఉపయోగం ఏంటో చంద్రబాబే చెప్పాలి. 2014లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబును గెలిపించడానికి ఒక ముఖ్యకారణం సమర్థవంతమైన పాలన అందిస్తాడన్న నమ్మకమే. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచీ కూడా పాలనా సామర్థ్యం విషయంలో కూడా చంద్రబాబు తిరోగమన దిశగా పయనిస్తూ ఉన్నాడన్నది కంటికి కనిపిస్తున్న నిజం. సోషల్ మీడియాని కూడా నియంత్రించి భజన మీడియాతో మేనేజ్ చేస్తే ప్రజలకు తప్పులు తెలియవు అన్న భ్రమల్లో చంద్రబాబు ఉన్నాడేమో తెలియదు కానీ చంద్రబాబు పాలన విషయంలో ప్రజల అసంతృప్తి పెరుగుతూ ఉంది అన్న విషయం మాత్రం నిజం. దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే ఫలితం దిమ్మతిరిగే రేంజ్లో ఉంటుందన్నది కూడా వాస్తవం.