విజయవాడలో దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్ కుమార్ నిర్వహించిన సమావేశంలో ఏపీ ఎంపీలు పాల్గొన్నారు. నిజానికి, ఇది ప్రతీయేటా జరిగే ఓ రొటీన్ సమావేశం. స్థానికంగా ఉన్న సమస్యలపై చర్చించి, కొత్త ప్రాజెక్టులూ తీరుతెన్నులపై ఈ సమావేశం జరుగుతుంది. మంగళవారం జరిగిన ఈ సమావేశంలో ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. సమస్యల విషయమై గతంలో తాము చేసిన ప్రతిపాదనలేవీ ఇంతవరకూ అమలుకు నోచుకోలేదని మండిపడ్డారు. ఈ సమావేశానికి వెళ్లడానికి ముందే కేశినేని నాటి ఇంట్లో ఎంపీలు సమావేశమయ్యారు. ఆ తరువాత, సమావేశ మందిరానికి ప్లకార్డులతో వచ్చి… ముందుగా విశాఖ రైల్వే జోన్ కేటాయింపు గురించి మాట్లాడాలంటూ నిరసనకు దిగారు.
అనంతరం, మీడియాతో కేశినేని నాని మాట్లాడుతూ… రాష్ట్రానికి రైల్వే జోన్ ఇవ్వాలని విభజన చట్టంలో ఉందనీ, తమ ఫోకస్ అంతా విశాఖ రైల్వే జోన్ మీద ఉందనీ, కేంద్రం స్పందించి ఇచ్చే వరకూ ఈ పోరాటం ఆగదు అన్నారు. ఎంపీ మురళీ మోహన్ మాట్లాడుతూ… ఇతర అంశాలు పక్కనపెట్టి రైల్వే జోన్ గురించి ముందు మాట్లాడాలంటూ పట్టుబట్టామన్నారు. దీనికి సంబంధించి ఏదైనా సమాచారం అధికారులకు వచ్చిందా లేదా అని అడిగామన్నారు. అయితే, అది తమ పరిధిలో లేని అంశమనీ, దీనికి సంబంధించిన నివేదికను కేంద్రానికి పంపిస్తామని అధికారులు చెప్పారన్నారు. రైల్వేజోన్ డిమాండ్ కి సంబంధించిన నిరసనను మరోసారి కేంద్రానికి అర్థమయ్యేలా తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేశామన్నారు. గత ఏడాది కూడా ఇలానే విజయవాడలో జరిగిన సమావేశంలో నిరసన వ్యక్తం చేశారు. అప్పుడూ రైల్వేజోన్ డిమాండే ప్రధానంగా వినిపించింది.
ఈ సమావేశంలో వినిపించే డిమాండ్లు కేంద్రం వరకూ చేరుతున్న దాఖలాలైతే కనిపించడం లేదు! విశాఖ రైల్వేజోన్ మీద ఇక్కడ వ్యక్తీకరించిన నిరసన… ప్రజల అసంతృప్తిని కేంద్రానికి తెలియాలన్నంతవరకే పరిమితమౌతుంది. దానిపై కేంద్రం స్పందన ఊహించలేం. ఇక్కడి అధికారులు కేంద్రానికి నివేదికలు పంపినంత మాత్రాన స్పందన వస్తుందన్న ఆశ లేదు! ఎందుకంటే, పార్లమెంటులో డిమాండ్ చేసినా భాజపా సర్కారుకి వినిపించుకోని పరిస్థితి. రైల్వే జోన్ అంశమై కేంద్రం ఏమాత్రం సీరియస్ గా లేదనేది ఆ మధ్య చేసిన ప్రకటనల్ని మరోసారి గుర్తు చేసుకుంటే అర్థమౌతుంది. ఇక, రాష్ట్రంలో అన్నీ చేసేశామని చాటింపేసుకునే పనిలో ఉన్న భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి, సోము వీర్రాజు వంటి భాజపా నేతలైతే ఇలాంటి సందర్భంలో మాట్లాడతారా… అంటే, అదీ ఆశించలేం..!