విభజన హామీలు అంటే.. అది ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అంశంగా.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా ప్రచారం జరుగుతోంది. కానీ విభజన చట్టంలో.. హామీలు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినవి. కానీ ఏపీలోని రాజకీయ పార్టీలు.. ముఖ్యంగా అధికార తెలుగుదేశం పార్టీ బీజేపీతో మిత్రత్వాన్ని సైతం తెగదెంపులు చేసుకుని పోరాటం ప్రారంభించడంతో.. అదేదో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అంశంగా మారిపోయింది. అదే సమయంలో.. తెలంగాణలో విభజన హామీల కోసం.. ఎలాంటి పోరాటాలు జరగడం లేదు. విభజన చట్టంలో తమకు రావాల్సిన వాటి గురించి .. తెలంగాణ ప్రభుత్వం కూడా.. పెద్దగా పోరాడటానికి ఆసక్తి చూపించడం లేదు. ఇది కూడా.. విభజన హామీలు ఏపీకి సంబంధించినవిగా అభిప్రాయం ఏర్పడటానికి ఓ కారణం.
18వ తేదీ నుంచి ప్రారంభం కానున్న వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో… కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి ఇరుకున పెట్టడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోంది. ఆ పార్టీ ఎంపీలందరూ బృందాలుగా విడిపోయి… ప్రాంతీయ పార్టీల అధినేతలను కలిసి మద్దతు కోరుతున్నారు. శరద్ పవార్, ఉద్ధవ్ థాక్రే, డీఎంకే నేతల వద్దకు.. తోట నరసింహం, కొనకళ్ల నారాయణ, సీఎం రమేష్ వెళ్లారు. అదే సమయంలో.. తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతు కోరడానికి సుజనాచౌదరి నేతృత్వంలో కొంత మంది వెళ్లారు. కేసీఆర్‌ను కలుద్దామనుకున్నా కుదరకపోవడంతో.. ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశరావుతో సమావేశమయ్యారు. పార్లమెంట్లో పోరాటానికి మద్దతు అడిగారు.
అనూహ్యంగా కె.కేశవరావు కూడా.. విభజన చట్టంలోని హామీలు అమలు చేయకపోవడం ద్వారా తెలంగాణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రకటించారు. విభజన చట్టంతో పాటు… అప్పటి ప్రధానమంత్రి పార్లమెంట్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అయితే పార్లమెంట్లో కలసి పోరాడతారా అన్న విషయంపై మాత్రం పూర్తి క్లారిటీ ఇవ్వలేదు.
పార్లమెంట్ బడ్జెట్ రెండో విడత సమావేశాల సమయంలో.. తెలుగుదేశం పార్టీ.. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి.. కేంద్రంపై అవిశ్వాసం పెట్టింది. అప్పుడు విపక్ష పార్టీలన్నీ ఏకమయ్యాయి. కానీ కొన్ని రోజులు టీఆర్ఎస్ సభను అడ్డుకుంది. బీజేపీ వ్యూహం ప్రకారమే టీఆర్ఎస్ అడ్డుకుందని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు కూడా..తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ఇచ్చేందుకు సిద్ధమవుతోందన్న ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నుంచి అవిశ్వాసం ప్రకటనలు వస్తున్నాయి. మరి విభజన హామీల కోసం.. టీడీపీ చేసే పోరాటంలో టీఆర్ఎస్ కలుస్తుందో లేదో అన్నది ఆసక్తికరంగా మారింది.