ఆలు లేదు చూలు లేదు…కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంది ఆంధ్రప్రదేశ్ ఎంపిల గొడవ. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తా మొన్న విజయవాడలోని రైల్వే కల్యాణ మండపంలో తెదేపా ఎంపిలతో సమావేశమయినపుడు వారి మధ్య రైల్వే జోన్ ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంపై గొడవ జరిగింది.
రైల్వే జోన్ ఏర్పటుపై చర్చ జరుగుతునప్పుడు, నర్సారావుపేట తెదేపా ఎంపీ రాయపాటి సాంభశివరావు “తుఫానులు వరదలు సంభవించే విశాఖ నగరంలో రైల్వే జోన్ ఏర్పాటు చేయడం కంటే గుంటూరులో ఏర్పాటు చేస్తే మంచిదని” అన్నప్పుడు దానికి అనకాపల్లి ఎంపీ ఆవంతి శ్రీనివాస్, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు తీవ్ర అభ్యంతరం తెలిపారు. “అదే కారణంగా అయితే కృష్ణా జిల్లాలో కూడా పెను తుఫానులు సంభవిస్తుంటాయని, అంత మాత్రాన్న రాజధానిని అక్కడ నిర్మించరాదని ఎవరూ అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు కదా?” అని ప్రశ్నించారు. విశాఖలో రైల్వే జోన్ కోసం ఉత్తరాంద్ర ప్రజలు చిరకాలంగా డిమాండ్ చేస్తున్నారని, రైల్వే జోన్ ఏర్పాటు అనేది విశాఖ ప్రజల సెంటిమెంటుతో ముడిపడుందని కనుక దానిని అక్కడి నుండి వేరే చోటికి తరలించుకుపోవాలని ఎవరయినా ప్రయత్నిస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా రైల్వే జోన్ ఏర్పాటు చేసే ఆలోచననే రైల్వే శాఖ విరమించుకొందని ఇంతకు ముందు మీడియాలో వార్తలు వచ్చేయి. కానీ వారు ఆ సంగతి మరిచిపోయినట్లు రాని రైల్వే జోన్ ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై వాదోపవాదాలు చేసుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎంపిలు అందరూ కలిసి రైల్వే జోన్ ఎప్పటిలోగా ఏర్పాటు చేస్తారు? అసలు ఏర్పాటు చేసే ఉద్దేశ్యం ఉందా లేదా? అని ఈ సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తాని నిలదీసి ఉండాల్సింది. కానీ ఆ పని చేయకుండా ఈ విధంగా వాదోపవాదాలు చేసుకొని తమ ప్రభుత్వానికే కొత్త సమస్యలు సృష్టించుకొంటున్నారు.
ఎంపి జేసీ దివాకర్ రెడ్డి ఈ సమావేశంలో రవీంద్ర గుప్తాని సరిగ్గా నిలదీసారని చెప్పవచ్చును. దక్షిణ మధ్య రైల్వేల అభివృద్ధికి సూచనలు, సలహాలు ఇమ్మని రవీంద్ర గుప్తా ఎంపిలని కోరినప్పుడు, “ఇదివరకు ఆమోదించిన ప్రాజెక్టులనే చేపట్టకుండా, వాటికి కేటాయించిన నిధులను మంజూరు చేయకుండా మళ్ళీ కొత్తగా సలహాలు అడగడం దేనికి? మా సలహాలు అమలుచేయనప్పుడు మళ్ళీ సలహాలు అడగడం దేనికి?” అని గట్టిగా నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపిలు అందరూ అంత గట్టిగా మాట్లాడగలిగినపుడే రాష్ట్రానికి ఇచ్చిన హామీలు అమలయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఆ పని చేయకుండా ఆకాశంలో మబ్బులు చూసి కుండలో నీళ్ళు బయట పారబోసుకొన్నట్లుగా, వస్తుందో రాదో తెలియని రైల్వే జోన్ కోసం కీచులాడుకోవడం చాలా అవివేకమేనని చెప్పక తప్పదు.