తెదేపా ఎంపిలు ఈరోజు కూడా ప్రత్యేక హోదా కోరుతూ పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్నారు. అంతేకాదు..ప్రత్యేక హోదాపై లోక్ సభలో కూడా చర్చ జరపాలని కోరుతూ ఇవ్వాళ్ళ స్పీకర్ కి వాయిదా తీర్మానం అందజేశారు. మోడీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జి.ఎస్.టి.బిల్లు రేపు రాజ్యసభలో ప్రవేశపెట్టబోతోంది. దానికి అడ్డుపడుతున్న కాంగ్రెస్ పార్టీకి ఏదోవిధంగా నచ్చజెప్పి దానిని రేపు ఆమోదింపజేసుకోవాలని కేంద్రం చాలా తిప్పలు పడుతోంది. ఇటువంటి సమయంలో మిత్రపక్ష తెదేపా ఎంపిలే ఈవిధంగా ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టిస్తుండటంతో కేంద్రప్రభుత్వం చాల అసహనంగా ఉంది కానీ బయటపడలేదు.
ఏపికి ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ తేల్చి చెప్పారు. ఆ విషయం వెంకయ్య నాయుడు కేంద్రమంత్రి సుజనా చౌదరికి తెలియజేశారు కూడా. ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా దానికి బదులు ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు చాలా కాలంగా కోరుతున్నారు. కానీ గత ఆర్నెల్లుగా రాష్ట్రానికి రావలసిన నిధులని అప్పులు లెక్కలలో సర్దేస్తోంది తప్ప పెద్దగా నిధులు విడుదల చేయలేదు. కనుక ఇప్పుడు కేంద్రం ఇస్తున్న ఈ బారీ ఆఫర్ ని తెదేపా స్వీకరించడం తధ్యం.
కేంద్రం ఇవ్వబోయే ఆ ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వీకరించినట్లయితే ఇక ప్రత్యేక హోదా గురించి డిమాండ్ చేయమని అంగీకరించినట్లే భావించవచ్చు. ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి ఇవ్వడానికి సిద్దం అని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసిన తరువాత కూడా దానిపై తమ అభిప్రాయం చెప్పకుండా, తెదేపా ఎంపిలు ఇంకా పార్లమెంటు లోపలా బయటా చాలా హడావుడి చేస్తుండటం కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది. బహుశః రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల బాధ భరించలేకనే తెదేపా డిల్లీలో హడావుడి చేస్తుండవచ్చు లేదా వీలైనంత ఎక్కువగా రాబట్టుకొనేందుకే ఈవిధంగా మరికొంత కాలం బెట్టు చేస్తున్నారేమో?
ఇంతకాలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రప్రభుత్వం పట్ల చాలా వినయంగా, మర్యాదగా వ్యవహరిస్తే, కేంద్రం ఆయనని పట్టించుకోలేదు. కారణాలు ఎవయితేనేమి చివరికి ఆయన తెగించి డిల్లీలో పోరాటం మొదలుపెట్టేసరికి ప్రధాని నరేంద్ర మోడీ దిగి వచ్చారు. కేంద్రప్రభుత్వం ఈవిధంగా చేయడం వలన రైల్వేజోన్, పోలవరం వంటి హామీల అమలు కోసం కూడా ఇదేవిధంగా పోరాడితే తప్ప మంజూరు చేయరనే తప్పుడు సంకేతాలు పంపినట్లయింది. దీనిని ప్రేరణగా తీసుకొని ఇతర రాష్ట్రాలు కూడా రకరకాల డిమాండ్లతో కేంద్రప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టే అవకాశం ఉంటుంది కూడా.