తెదేపా నిన్న మూడు చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొంది. 1.ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్రప్రభుత్వ వైఖరికి నిరసనగా నేడు తెదేపా ఎంపిలు పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన (ధర్నా) చేయడం. 2. ప్రధాని నరేంద్ర మోడీతో అత్యవసర సమావేశం కోసం అపాయింట్ మెంట్ కోరుతూ కేంద్రమంత్రులు లేఖ వ్రాయడం.3. ఇక ప్రధాని మోడీని కలిసి బ్రతిమాలనని చంద్రబాబు నాయుడు చెప్పడం.
ఈ మూడు నిర్ణయాలు కూడా తెదేపా-భాజపా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలపై ప్రభావం చూపేవే. తెదేపా ఎంపిలు ఇప్పటికే పార్లమెంటు సమావేశాలలో కాంగ్రెస్, వైకాపా ఎంపిలకంటే చాలా గట్టిగా హామీల అమలుగురించి కేంద్రప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో మొన్న ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నప్పుడు, కేంద్రమంత్రి సుజనా చౌదరి ఆయనకి అడ్డుపడి ప్రశ్నిస్తుండటం చూసి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పిజె కురియన్ కూడా ఆశ్చర్యపోయారు. కేంద్రప్రభుత్వంలో మంత్రిగా ఉంటున్న సుజనా చౌదరే తన ప్రభుత్వాన్ని ప్రశ్నించడం చాలా విచిత్రంగా ఉందని అన్నారు.
చంద్రబాబు అభ్యర్ధనలని ప్రధాని నరేంద్ర మోడీ పట్టించుకోకపోవడం, ఆ కారణంగా తెదేపా-భాజపా నేతల విమర్శలు, ప్రతివిమర్శలు, రాష్ట్రంలో కొన్ని సంఘటనలు, తెదేపా సభ్యులు పార్లమెంటులో కేంద్రాని గట్టిగా నిలదీయడం వంటివన్నీ ఇప్పటికే ఆ రెండు పార్టీల మధ్య చాలా దూరం పెంచాయి. తెదేపా తీసుకొన్న తాజా నిర్ణయాలతో ఆ దూరం ఇంకా పెరుగవచ్చు. ఇప్పటికైన కేంద్రప్రభుత్వం ఒకమెట్టు దిగివచ్చి తెదేపాతో రాజీపడకపోతే ఆ దూరం శాస్వితం కావచ్చు. దాని వలన తెదేపా కంటే భాజపాయే ఎక్కువ నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ అది తెదేపాకి కూడా మేలు చేయదు. ఆ సంగతి ఆ రెండు పార్టీలకి కూడా బాగా తెలుసు కనుక ఒకవేళ అవి రాష్ట్రంలో ప్రతిపక్షపార్టీలని, ప్రజలని మభ్యపెట్టాలని భావిస్తున్నట్లయితే, ఇలాగే ఒకదానినొకటి అప్పుడప్పుడు విమర్శించుకొంటూ, తమ పొత్తులని యధాతధంగా కొనసాగించవచ్చు. ఒకవేళ భాజపా అధిష్టానం కూడా తెదేపాతో తెగతెంపులకి సిద్దం అయితే, తక్షణమే అది కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి తన ఇద్దరు మంత్రుల చేత రాజీనామాలు చేయించి, తెదేపాని గట్టిగా వ్యతిరేకించే సోము వీర్రాజుని రాష్ట్ర భాజపా అధ్యక్షుడుగా ప్రకటించవచ్చు.