అనబోతే అక్క కూతురు, కొట్టబోతే గర్భవతి అని వెనకటికో నాటు సామెత. ఏపీ తెలుగుదేశం పార్టీ ఎంపీల పరిస్థితి అచ్చంగా ఇలానే ఉంది..! ప్రత్యేక ప్యాకేజీ చట్టబద్ధత విషయంలో కేంద్రం మెడలు వంచేస్తామని, భాజపాపై ఒత్తిడి చేసి సాధించేస్తామని ప్రతిజ్ఞ చేసిన సంగతి తెలిసిందే. ఒత్తిడి తేవడం అంటే కొన్ని విమర్శలు చేయాల్సి ఉంటుంది కదా! కొన్ని ప్రశ్నలు అడగాల్సి ఉంటుంది కదా! చట్టబద్ధత ఎందుకు అవసరమో చెప్పాల్సి ఉంటుంది కదా! అయితే, ఈ క్రమంలో కేంద్రంపై కొన్ని విమర్శలు చేయక తప్పదు. కానీ, ‘అలా మాట్లాడొద్దు’ అంటూ ఎంపీలను చంద్రబాబు నాయుడు కట్టడి చేస్తున్నట్టు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ అంటే తమకు ప్రత్యేక రాష్ట్రం అని కేంద్రం ఎప్పుడూ చెబుతూ ఉంటుంది. కానీ, కేంద్ర బడ్జెట్లో ఆ ప్రత్యేకత ఏ మూలనా కనిపించలేదు. పోలవరం ఊసెత్తలేదు. ఓ రూ. 50 కోట్లు ఇచ్చేసి… వాటితోనే ఐఐఎం, ఐఐటీలు నిర్మించేసుకోమన్నారు! ఆ నిధులతో ఏ స్థాయి నిర్మాణాలు పూర్తవుతాయో వారికే తెలియాలి! రాజధాని రైతులకు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ మినహా ఆంధ్రాకి బడ్జెట్లో దక్కిందేం లేదు. ఈ అసంతృప్తి అందరిలోనూ ఉంది. ఇదే అసంతృప్తిని బయటపెడుతూ… ప్రత్యేక ప్యాకేజీ చట్టబద్ధతను నిలదీయాలన్న వ్యూహంతో ఎంపీలు కదంతొక్కారు! అయితే, చంద్రబాబు ఆదేశాలు మరోలా ఉండటంతో వారు మారుమాటాడలేకపోతున్నారు.
ఇప్పటికే ఏపీ ఎంపీలు ఏమీ చేయలేకపోతున్నారన్న ఇమేజ్ పుష్కలంగా ఉంది! తెలుగుదేశం ఎంపీల వైఫల్యం వల్లనే ప్రత్యేక హోదా దక్కకుండా పోయిందన్న విమర్శ కూడా కావాల్సినంత ఉంది. ఈ నేపథ్యంలో ప్యాకేజీ చట్టబద్ధత విషయంలోనైనా ‘కేంద్రాన్ని తాము నిలదీశాం’ అనే ఇమేజ్ కోసం ప్రయత్నిస్తుంటే అదీ కుదరడం లేదు. పైకి చెప్పకపోయినా.. ఆఫ్ ద రికార్డ్ కొంతమంది ఎంపీలు ఇదే విషయమై అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. బడ్జెట్ కేటాయింపులపై కేంద్రాన్ని విమర్శించేందుకు సీఎం అనుమతి ఇవ్వడం లేదనీ, చట్టబద్ధత విషయంలోనూ భాజపాని గట్టిగా నిలదీసే ఛాన్స్ ఇవ్వడం లేదని అంటున్నారట!
కేంద్రాన్ని ఆయన అడగరు… అడుగుతాం అనేవారికి కట్టడి చేస్తారు! భాజపా అంటే ఇంతగా లొంగిపోవాల్సిన అవసరం ఏముంది..? ఏమైనా అంటే ఓ మెట్ట వేదాంతం చెబుతారు.. కేంద్రంతో వివాదం మంచిది కాదు, సానుకూలంగానే మనకు రావాల్సినవి సాధించుకోవాలీ అంటారు! ఇదే మెతక వైఖరి కొనసాగితే ప్యాకేజీ చట్టబద్ధత కూడా చట్టుబండలైపోవడం ఖాయం..!