ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ రాజకీయ విమర్శల సుడిగుండంలో చిక్కుకున్నారు. ఆలయాల ధ్వంసం ఘటనల్లో టీడీపీ, బీజేపీ నేతల ప్రమేయం ఉందని ఆయన కనుమ రోజు ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పారు. ఆ కేసుల వివరాలను తర్వాత మీడియాకు ఇచ్చారు. అందులో ఒక్కటంటే ఒక్క కేసు కూడా ఆలయాలపై దాడుల కేసు లేదు. సోషల్ మీడియా ప్రచారాల గురించే ఉంది. దీంతో టీడీపీ, బీజేపీ నేతలు భగ్గుమన్నారు. డీజీపీ గౌతం సవాంగ్ వైసీపీ నేతలా మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. ఏ సమాచారంలో.. ప్రెస్మీట్లో టీడీపీ, బీజేపీ ఆలయాలు ధ్వంసం చేస్తున్నాయని ప్రకటించారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి.
భారతీయ జనతా పార్టీ నేతలు కూడా.. డీజీపీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. ఎమ్మెల్సీ మాదవ్ .. గౌతం సవాంగ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విగ్రహాలు ధ్వంసం చేయాలని పరోక్షంగా రెచ్చగొట్టిన.. మంత్రి కొడాలి నానిని వెంటనే అరెస్ట్ చేయాలని విష్ణువర్థన్‌రెడ్డి డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలు గౌతం సవాంగ్గా తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. తాడేపల్లి ప్యాలెస్‌లో రాసిచ్చిన స్క్రిప్టులు చదవకపోతే.. పోస్టు పీకేస్తారని భయపడుతున్నారని అందుకే పోలీసు వ్యవస్థపై ప్రజలు నమ్మకం కోల్పోయేలా వ్యవహరించడానికి సిద్ధపడుతున్నారని మండిపడ్డారు. ఆయనను సినిమాల్లో బ్రహ్మానందాన్ని వాడుకుంటున్నట్లుగా వాడుకుంటున్నారని టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి విమర్శించారు.
డీజీపీపై విపక్షాలు ముప్పేట దాడి చేస్తూండటంతో.. వైసీపీ నేతలు కూడా రంగంలోకి దిగారు. డీజీపీకి మద్దతుగా ప్రకటనలు చేయడం ప్రారంభించారు. పోలీసులు నిష్పక్షిపాతంగా విచారణ చేస్తున్నారని వాదిస్తున్నారు. ఏపీలో జరుగుతున్న అన్ని వ్యవహారాల వెనుక చంద్రబాబు ఉన్నారని తేల్చేస్తున్నారు. మొత్తానికి ఆలయాలపై దాడుల వ్యవహారంలో నిజమైన నిందితుల్ని పట్టుకుంటే ఇంత రాజకీయం అయి ఉండేది కాదు.. కానీ.. వాటిని వైసీపీకి అంటించాలని విపక్షాలు.. విపక్షాలకు అంటించాలని వైసీపీ ప్రయత్నిస్తూండటంతో తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది. బురద చల్లుడు ప్రోగ్రాంలోకి పోలీసు బాస్ కూడా రావడంతో ఇది మరింత అవాంఛనీయ స్థితికి చేరుతోంది.