భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో ఏపీ భాజపా నేతలు ఢిల్లీలో సమావేశమయ్యారు. ఎన్డీయే నుంచి టీడీపీ వైదొలగడం, కేంద్రంపై టీడీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఏపీ నేతలు ఢిల్లీకి వెళ్లారు. ఇలాంటి సమయంలో వారి మధ్య చర్చకు రావాల్సిన ప్రధానాంశం ఏంటీ..? రాష్ట్రంలో వ్యక్తమౌతున్న ప్రజాగ్రహాన్ని వారి పార్టీ జాతీయ అధ్యక్షుడికి అర్థమయ్యేలా ఏపీ నేతలు చెప్పాలి కదా! కానీ, ఆ భేటీలో అలాంటి అంశం చర్చకు వచ్చినట్టే లేదు. అమిత్ షాతో భేటీ అనంతరం ఏపీ భాజపా నేతలు మీడియాతో మాట్లాడారు.
ఇకపై టీడీపీని ప్రత్యర్థి పార్టీగానే చూడాలని అమిత్ షా సూచించారని చెప్పారు. అంతేకాదు, ఇంతవరకూ రాష్ట్రానికి భాజపా చేసిన మేలు ఏంటనేది ప్రజలకు సవివరంగా చెప్పాలని నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేశారు. ఏపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాకి తగ్గని ప్రయోజనాలను ఏపీకి ఇచ్చామని చెప్పారు. మూడున్నరేళ్లలో పలు విద్యా సంస్థల్ని నెలకొల్పామనీ, విభజన చట్టంలో ఉన్న ఇతర హామీలను కూడా త్వరలోనే నెరవేర్చుతామని చెప్పారు. చంద్రబాబు, జగన్, పవన్ లు ప్రత్యేక హోదా పేరుతో ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారంటూ పార్టీ మండిపడిందని హరిబాబు చెప్పారు. భాజపాపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని నిర్ణయించామన్నారు. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు కంటే ఎక్కువ నిబద్ధతతో ఉన్నామనీ, ఇకపై తాము అడిగే ప్రశ్నలకూ ఆయన సమాధానం చెప్పాల్సి వస్తుందని రామ్ మాధవ్ అన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా కాస్త అటుఇటుగా ఇదే కంటెంట్ మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ తరఫున అమిత్ షా దగ్గరకి వెళ్లిన భాజపా నేతల తీరు ఇది..! అమిత్ షా చెప్పింది మాత్రమే వినొచ్చారంతే..! సరే, రాష్ట్రానికి అన్నీ ఇచ్చేశామన్న మైండ్ సెట్ లో ఏపీ నేతలూ ఉన్నారు..! కాబట్టి, వారేదో ప్రత్యేకంగా మరోసారి ఏపీ ప్రయోజనాల గురించి అమిత్ షా ముందు మాట్లాడేంత ధైర్యం చేస్తారని ఎవ్వరూ అనుకోరు. కనీసం, భాజపాపై ఏపీలో వ్యక్తమౌతున్న తీవ్ర వ్యతిరేకతను కూడా ఆయన ముందు ప్రస్థావించినట్టు లేదు.