మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మేము మద్దతిచ్చాం.. మా అక్రమాలకు మద్దతివ్వట్లేదు.. మాకు ఎలాంటి అనుచిత లబ్ది చేకూర్చడం లేదు.. మేము రివర్స్ అవుతాం .. తప్పుడు ప్రచారాలు చేస్తాం అని కొంత మంది సోకాల్డ్ టీడీపీ అభిమానులు పార్టీని బెదిరించడం ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీకి కొత్త సమస్యగా మారింది. టీడీపీ కోసం కొన్ని లక్షల మంది పని చేశారు. వారిలో కొంత మంది మాత్రం బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నారు. ఇందులో సోకాల్డ్ సర్వేయర్లు కూడా ఉన్నారు.
సర్వేల పేరుతో బ్లాక్ మెయిల్ చేస్తున్న ఓ వ్యక్తి
2019 ఎన్నికల సమయంలో వైసీపీ కోసం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఓ వ్యక్తి .. ఆ తర్వాత వైసీపీ నేతలు దండిగా డబ్బులివ్వలేదని ప్లేట్ ఫిరాయించాడు. మీడియా సంస్థల పేరుతో పలువురని మోసగించినట్లుగా ఆరోపణలు ఉన్న ఆ వ్యక్తి విజయవాడ వచ్చి ఓ దుకాణం పెట్టేశాడు. సర్వేల పేరుతో హడావుడి చేశాడు. కనీసం ఇద్దరు ఉద్యోగులకు జీతాలివ్వలేని అతను.. సర్వేలు ఎలా చేస్తాడో చెప్పాల్సిన పని లేదు. ఎన్నికల సమయంలో ఆయన చేసిన సర్వేలన్నీ తప్పుల తడకలే. అయినా తాను టీడీపీ గెలిచిందని చెప్పానని గెలిచిందని ప్రకటించుకుని ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. అప్పుడప్పుడు పోస్టులు పెడుతూ.. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ.. పలు నియోజకవర్గాల్లో అసంతృప్తి అని.. అదని ఇదని.. టార్గెటెడ్ గా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. అంతర్గతంగా ఎవర్ని సంప్రదించి డబ్బులు వసూలు చేస్తున్నాడో టీడీపీ వర్గాలకూ అర్థం కావడం లేదు. మరో ఇద్దరు, ముగ్గురు యూట్యూబర్లదీ అదే దారి. రాజకీయం పై కనీస పరిజ్ఞానం ఉండదని వారి మాటలను బట్టి అర్థమవుతూనే ఉంటుంది. కానీ వారు బ్లాక్ మెయిలింగ్ లో రాటుదేలిపోయి ఉంటారు.
రావి మురళి అనే పార్టీ సానుభూతిపరుడిది అదే దారి !
అసంతృప్తి పెరుగుతోందని ప్రచారం చేస్తే టీడీపీ నేతలు సహకరిస్తారని.. తమ దందాలకు.. లేదా ఇతర వాటికి డబ్బులిస్తారని కొంత మంది ఆశపడుతున్నారు. అలా చేయడానికి ఒక్క సోషల్ మీడియా పోస్టింగ్ సరిపోతుందని అనుకుంటున్నారు. ఇటీవల చిలకలూరిపేటలోని సాయి కార్తీక్ సెంటర్ అనే షాపింగ్ మాల్ యజమాని, ఎన్నారై అయిన రావి మురళి అనే వ్యక్తి అలాగే పోస్టులు పెట్టాడు. లోకేష్ పై ఆరోపణలు చేశాడు. తీరా చూస్తే అతను చిలుకలూరిపేటలో వంద మంది టీడీపీ సానుభూతిపరుల వద్ద అప్పులు తీసుకుని ఆ షాపింగ్ కాంప్లెక్స్ కట్టాడు. ఎవరికీ రూపాయి చెల్లించలేదు. ఆ వివాదాల్లో లోకేష్ ను తీసుకు వచ్చాడు. ఎవరికో డబ్బులు పంపించి అది లోకేష్ బినామీ అని ప్రచారంలో పెట్టాడు. పార్టీ పెద్దల్ని బ్లాక్ మెయిల్ చేసి తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఆయన తెగించారు.
చేయగలిగిన పనులు చేయించుకోలేని వాళ్లు కొందరు !
పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారు లక్షల్లో ఉన్నారు. అలాంటి వారిలో చాలా మంది నిబంధనలకు అనుగుణంగానే తమ పనులు తాము చేయించుకోలేకపోతున్నారు. పార్టీ పెద్దలను అడిగితే ఏమనకుుంటారోనన్న సందేహం.. పార్టీని ఉపయోగించుకున్నట్లు అవుతుందని.. అప్పుడు అభిమానంతో పని చేసినట్లుగా ఎలా అవుతుందన్న ఆత్మాభిమానంతో కొందరు .. తమ పనుల్ని అందరితో పాటే జరిగేలా చూసుకుంటున్నారు కానీ.. పెద్దల వద్దకు పోలేకపోతున్నారు. టీడీపీ హైకమాండ్ పార్టీ కార్యకర్తలకు అత్యున్నత గౌరవం ఇస్తుంది కానీ.. బ్లాక్ మెయిలర్లకు కాదని పార్టీ నేతలు అంటున్నారు.