తెదేపా రాజ్యసభ అభ్యర్ధులుగా కేంద్రమంత్రులు సురేష్ ప్రభు, సుజనా చౌదరి, మాజీ మంత్రి టిజి వెంకటేష్ లను ఎంపిక చేసింది. అయితే వారికి సీట్లు కేటాయించడం సరైన నిర్ణయమేనా కాదా? అనే చర్చ తెదేపాలో, బయటా కూడా మొదలయింది. భాజపాకి చెందిన సురేష్ ప్రభుకి తెదేపా కొటాలో సీటు కేటాయించడం, కేంద్రం పట్ల తెదేపా సానుకూల వైఖరితోనే ఉన్నట్లు తెలియజేయడానికి ఉపయోగపడవచ్చు. కానీ దానితో సంబంధాలు మెరుగుపడకపోయినా, కనీసం యధాతధ స్థితిలో కొనసాగించడానికి ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారేమో?
అయితే, రాజధానికి నిధులు, ఆర్ధిక ప్యాకేజి, రైల్వే జోన్ ఏర్పాటు వంటి హామీల అమలు గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీని ఎన్నిసార్లు ప్రాధేయపడినా ఏ మాత్రం పట్టించుకోనప్పుడు, చంద్రబాబు కేంద్రం పట్ల అంత మెతక వైఖరి అవలంభించడం అనవసరమనే అభిప్రాయం ప్రజలు, ప్రతిపక్షాలలోనే కాకుండా తెదేపా నేతలలోనే వ్యక్తం అవుతోంది. భాజపా అధ్యక్షుడు అమిత్ షా మొన్న హైదారాబాద్ వచ్చినప్పుడు, ‘తెరాస కోరితే కేంద్రమంత్రి పదవి ఇవ్వడానికి సిద్దంగా ఉన్నట్లు’ చెపితే,తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ “అక్కరలేదు. మేము ఇలాగే స్వేచ్చగా, స్వంతంత్రంగా ఉండాలని కోరుకొంటున్నాము. మున్ముందు మీరే మాపై ఆధారపడే పరిస్థితి వస్తుంది,” అని నిర్భయంగా మాట్లాడటం చూస్తే ఆయనకి, చంద్రబాబుకి ఎంత తేడా ఉందో కళ్ళకు కట్టినట్లు స్పష్టంగా కనబడుతుంది.
తెలంగాణా రాష్ట్రం ఆర్ధికంగా బలంగా ఉంది కనుకనే కేసీఆర్ అంత నిర్భయంగా మాట్లాడగలుగుతున్నారనుకొన్నా, రాష్ట్రం రెండకెల ప్రగతి సాధిస్తోందని చంద్రబాబు చెప్పుకొంటునప్పుడు కేంద్రానికి అంతగా అణిగిమణిగి ఉండనవసరం లేదు కదా. కానీ ఉంటున్నారంటే, అభివృద్ధి గురించి ఆయన చెపుతున్న లెక్కలు అబద్దం అయినా అయ్యుండాలి లేదా వేరే కారణాలు ఉండవచ్చు. సురేష్ ప్రభుకి రాజ్యసభ సీటు కేటాయించడం ద్వారా చంద్రబాబు నాయుడు కేంద్రానికి, భాజపాకి మంచి సంకేతమే పంపారు. కానీ దాని వలన తెదేపాకి కాక రాష్ట్రానికి ప్రజలకి లాభం కలిగినప్పుడే ప్రజలు కూడా ఆయన నిర్ణయాన్ని సమర్ధిస్తారు.
ఇక సుజనా చౌదరి సంస్థలు మారిషస్ బ్యాంక్ కి రూ.108 కోట్లు ఎగవేసినట్లు ఆరోపణలు వచ్చినందున, ఈసారి ఆయనకి రాజ్యసభ సీటు ఇవ్వరని గుసగుసలు వినిపించాయి. కానీ మళ్ళీ ఆయనకే సీటు కేటాయించడంతో ప్రతిపక్షాలు విమర్శలు చేసేందుకు అవకాశం కల్పించినట్లయింది. తమ రెండేళ్ళ పాలనలో తమ ప్రభుత్వంపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదని ప్రధాని మోడీతో సహా భాజపా నేతలు అందరూ గొప్పలు చెప్పుకొంటున్నపుడు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సుజనా చౌదరినే కేంద్రమంత్రిగా కొనసాగించవలసి వస్తోంది. అందుకు మోడీ ప్రభుత్వం కూడా విమర్శలు మూటగట్టుకోకతప్పదు. సుజనా చౌదరి వలన రాష్ట్రానికి ఏమి మేలు జరుగుతోందో, మళ్ళీ ఆయనకే ఎందుకు సీటు కేటాయించవలసి వచ్చిందో చంద్రబాబుకే తెలియాలి.
ఇక టిజి వెంకటేష్ వలన తెదేపాకి గానీ రాష్ట్రానికి గానీ ఒరిగిందేమీ లేదు. రాష్ట్ర విభజన వలన రాష్ట్రానికి ఎంత కష్టం, నష్టం వచ్చిందో కళ్ళారా చూసి కూడా ఆయన మళ్ళీ రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేస్తానని బెదిరిస్తూనే ఉన్నారు. ఆయన నిజంగా రాయలసీమ ప్రాంతం వెనుకబాటుతనం గురించి ఆవేదన చెందుతూ ఆవిధంగా మాట్లాడి ఉంటే అర్ధం చేసుకోవచ్చు. కానీ తనకి మంత్రిపదవో మరొకటో ఇవ్వలేదనే కోపంతోనే ఆయన రాష్ట్ర విభజన ఉద్యమాలు చేస్తానంటూ మాట్లాడేవారని చెప్పకతప్పదు. ఇప్పుడు రాజ్యసభ సీటు ఇవ్వగానే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తన శక్తివంచనా లేకుండా కృషి చేస్తానని చెపుతున్నారు. దానిని బట్టి ఆయన పోరాటం దేనికో అర్ధం చేసుకోవచ్చు. తెలుగుదేశం పార్టీలో ఎందరో సీనియర్లు, అనుభవజ్ఞులు ఉన్నప్పటికీ వారినందరినీ కాదని టిజికి రాజ్యసభ సీటు కేటాయించడం చూస్తుంటే, ఆయన దాని కోసం ముఖ్యమంత్రిపై ఎంత ఒత్తిడి తెచ్చారో గ్రహించవచ్చు. ముఖ్యమంత్రి తీసుకొన్న ఈ నిర్ణయం వలన రాష్ట్రానికి ఏమైనా మేలు జరుగుతుందో లేదో తెలియదు కానీ, తప్పకుండా తెదేపాలో అసమ్మతి, అసంతృప్తి మొదలవుతుందని చెప్పవచ్చు.