ఎపి నూతన రాజధాని అమరావతి గురించి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విస్త్రతంగా ప్రచారం చేసుకుంటున్నది. విదేశాల నుంచి పెట్టుబడులు భారీగా తరలివస్తున్నాయంటున్నది. కాని తమ పార్టీ కార్యాలయం మాత్రం మంగళగిరి మండలం ఆత్మకూరుకు సమీపంలో జాతీయ రహదారిపై కట్టబోతున్నది. దీనికి ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారట. మూడు ఎకరాల లీజు స్థలంలో కట్టే ఈ కార్యాలయం వచ్చే ఏడాదిలో పూర్తవుతుందని టిడిపి నేతలు చెబుతున్నారు. ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ జనసేన కూడా చినకాకాని దగ్గర దాదాపు ఇంతే స్థలాన్ని మూడేళ్లు లీజుకు తీసుకుని కార్యాలయం నిర్మిస్తున్నట్టు ప్రకటించింది. రెండు పార్టీలు ఒకే విస్తీర్ణంలో ఒకే కాలవ్యవధికి లీజు ఒప్పందాలు కుదర్చుకోవడం ఆసక్తికరమైన విషయం.అదలా వుంచితే టిడిపి కార్యాలయం విషయంలోనే విమర్శనాత్మక వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అమరావతి నిర్మాణం అంత బాగా జరిగిపోతుంటే మీ కార్యాలయాన్ని అక్కడ ఎందుకు కట్టడం లేదు?భూముల విలువ అంతగా పెరిగిపోతుంటే మీరెందుకు లీజుకు తీసుకున్నారు? ఈ ప్రశ్నలు వైసీపీ వర్గాల నుంచే గాక విమర్శకుల నుంచీ వినిపించడం ఆసక్తికరం. మరి ఏలిన వారు ఏం చెబుతారో చూడాలి!