ఉదయం పది గంటలకు 35 శాతం ఈవీఎంలు మొరాయించాయి. పదకొండు గంటలకు 45 ఈవీఎంలు మాత్రమే పని చేయలేదు. ఇదీ సీఈసీ అరోరా ఏపీ ఎన్నికల గురించి చెప్పిన మాట. అంటే… పది గంటల వరకూ.. 35 శాతం ఈవీఎంలు పని చేయలేదని ఆయనే అంగీకరించారు. ఈ స్థాయిలో.. ఈవీఎంల సమస్య.. ఏ రాష్ట్రంలోనూ రాలేదు. తొలి విడతలోనే ఎన్నికలు జరిగిన తెలంగాణలో, రెండో విడతలో జరిగిన కర్ణాటక, తమిళనాడుల్లో కూడా ఈవీఎంల సమస్యలు పెద్దగా రాలేదు. ఒకటి రెండు చోట్ల మొరాయించిన పోలింగ్ సాఫీగానే జరిగింది. కానీ ఏపీలోనే అలా ఎందుకు జరిగిందన్నది టీడీపీ నేతలకు అర్థం కాని విషయం.
భెల్, ఈసీఐఎల్ ఇంజనీర్లు నియోజకవర్గానికి ముగ్గురు ఉన్నప్పటికీ వారు అనేక ప్రాంతాల్లో సమస్యలు రావటంతో బాగు చేయటం ఆలస్యమైంది. దీంతో పోలింగ్ మరుసటి రోజు తెల్లవారుజాము వరకు జరిగింది. ఈవీఎంలలో వచ్చిన సాంకేతిక లోపాలతో కొన్ని ప్రాంతాల్లో వాటిని మార్చినప్పటికీ, మరికొన్ని ప్రాంతాల్లో అవి తరచూ సమస్యలు వస్తూనే ఉన్నాయి. గంటకోసారి సాంకేతిక సమస్య తలెత్తి పోలింగ్ సిబ్బందిని, ఓటేసేందుకు వచ్చిన ఓటర్లను ఇబ్బందిపెట్టాయి. వందలాది పోలింగ్ కేంద్రాల్లో ఈ సమస్య తలెత్తింది. మంగళగిరి నియోజకవర్గంలో ఏకంగా నలభై పోలింగ్‌బూత్‌లలో ఈ సమస్య వచ్చింది. ఈవీఎంల్లో ఏర్పడిన సాంకేతిక సమస్యలను సరిదిద్దేందుకు సాయంత్రం 4 గంటల వరకు సాంకేతిక నిపుణులు పరుగులు తీస్తూనే ఉన్నారు. ఏపీలో పోలింగ్ తీవ్ర గందరోగళం మధ్య ముగిసింది.
రెండో విడత పోలింగ్ జరిగిన పశ్చిమబెంగాల్, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఈవీఎంల్లో సాంకేతిక సమస్యలు వచ్చినా.. అవి ఏపీలో వచ్చినంత తీవ్రమైనవి కావు. ఒకట్రెండు ప్రాంతాల్లో సాంకేతిక సమస్య తలెత్తినప్పటికీ వాటిని వెంటనే సరిదిద్దారని కూడా సమాచారం అందింది. దీంతో తెలుగుదేశం వర్గాలు ఇప్పటివరకు తాము అనుమానిస్తున్న కారణాలు నిజమేననే నిర్ణయానికి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ లో కావాలనే సాంకేతిక సమస్యలున్న ఈవీఎంలను ఉపయోగించారని టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు.