ఐదేళ్లలో ప్రజలకు ఏ కష్టం రాకుండా చూసుకున్నా.. ఓడిపోయామని.. టీడీపీ అధినేత అంటూంటారు. 23 సీట్లు మాత్రమే ఇచ్చేంత తప్పు తానేం చేశానని… సందర్భం వచ్చిన ప్రతీ సారి ప్రజలకు ప్రశ్న వేస్తూనే ఉంటారు. అధినేత అలా ఉంటే.. టీడీపీ నేతలు.. ఇంకెలా ఉంటారు..? వారు… కూడా అంతే. శుక్రవారం పొలిట్‌బ్యూరో మీటింగ్ పెడితే.. ఐదేళ్లు తాము పడిన కష్టాన్ని… వచ్చిన ఓటమిని గుర్తు చేసుకుని సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు కంటతడి పెట్టారట. ఎన్నికల ఫలితాలు వచ్చి.. రెండున్నర నెలలు అయిపోయింది. ఇప్పటికీ టీడీపీ.. ఓటమిని జీర్ణించుకోలేకపోతోంది.
బీసీలు, మాదిగల ఓట్లలో చీలిక..!
పొలిట్‌బ్యూరోలో మేథోమథనం తర్వాత.. తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్న బలహీనవర్గాలు, మాదిగల ఓట్లలో చీలిక వచ్చిందని… మాత్రం గుర్తించారు. వారిని మళ్లీ దగ్గరకు చేసుకునే ప్రయత్నాలు చేస్తామని ప్రకటించారు. సామాజిక సమీకరణలు సరిగా పాటించకపోవటంవల్లే ఓటమి వచ్చిందని…అంచనాకు వచ్చారు. వైసీపీ చేసిన దుష్ర్పచారంతో టీడీపీ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరుగునపడిపోయాయని కొంతమంది నేతలు వివరించారు. టీడీపీకి మద్దతుగా ఉన్న బీసీలు, మాదిగల ఓట్లలో కూడా చీలిక వచ్చిందని.. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలాగా డబ్బులు ఖర్చు చేయలేకపోయామని కొంత మంది పొలిట్ బ్యూరో సభ్యులు వ్యాఖ్యానించారు.
ఐదేళ్ల శ్రమను ప్రజలు ఇప్పుడు గుర్తిస్తున్నారు..!
ఐదేళ్ల పాటు పడిన శ్రమను ప్రజలు ఇప్పుడు గుర్తుచేసుకుంటున్నారని..అన్న క్యాంటీన్లను మూసివేయడం వల్ల పేదలు ఆకలితో ఆలమటిస్తున్నారని, చంద్రబాబు విలువ ఏమిటో ప్రజలకు ఇప్పుడు తెలిసి వస్తోందని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సమావేశంలో వ్యాఖ్యానించారు. దాదాపుగా.. అందరు నేతలు ఇదే అభిప్రాయంతో ఉన్నారు. జగన్ సీఎం అయితే ఏం జరుగుతుందని.. తాము చెప్పామో.. అదే జరుగుతోందని అంటున్నారు. అభివృద్ధి పనులన్నింటినీ నిలిపి వేయడం.. సంక్షేమ పథకాలను ఆపేయడాన్ని గుర్తు చేస్తున్నారు. పెన్షన్లు సమయానికి ఇవ్వకపోవడం… దాదాపుగా.. ఏ ప్రభుత్వ అభివృద్ధి పని సక్రమంగా జరగకపోవడంపై… ప్రజల్లో అసంతృప్తి ప్రారంభమయిందన్న అభిప్రాయానికి వచ్చారు.
ప్రభుత్వంపై ఇక పోరాటమే..!
పార్టీకి దూరమయ్యేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ బుజ్జగించకూడదని.. పొలిట్‌బ్యూరో నిర్ణయించింది. లోకేష్ వరద బాధిత ప్రాంతాల పర్యనటకు వెళ్తే.. ముగ్గురు కీలక నేతలు గైర్హాజరయ్యారు. త్వరలో జరగనున్న సర్వసభ్య సమావేశంలో.. పార్టీ నేతలకు అండగా ఉండే వారు మాత్రమే… కొనసాగాలని.. కుండబద్దలు కొట్టనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. టీడీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఎదుర్కోవడానికి అందరూ గ్రామాల బాట పట్టాలని నిర్ణయించారు. ప్రభుత్వానికి ఆరు రోజుల సమయం ఇస్తున్నారని.. చక్కదిద్దకపోతే.. పోరాటమేనని.. టీడీపీ ప్రకటించింది.