గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు ఏపీలోనూ చర్చనీయాంశం అవుతున్నాయి. దానికి కారణం… ఆంధ్ర సెటిలర్లు ఉన్న ప్రాంతాల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. అక్కడ టీడీపీ అభ్యర్థులు పోటీ చేసినప్పటికీ.. వారెవరికీ డిపాజిట్లు రాలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు వైసీపీ బహిరంగ మద్దతు తెలిపింది. వైసీపీ నేతలు సొంత ఖర్చులతో సామాజిక సమావేశాలు పెట్టారు. అయితే ఈ సారి అలాంటి పరిస్థితి కనిపించలేదు. ఎందుకంటే గత ఎన్నికల్లో టీడీపీ ప్రధాన ప్రత్యర్థిగా ఉంది. ఈ సారి బీజేపీ ఉంది. బీజేపీకి కోపం వస్తే.. తమకు గడ్డు పరిస్థితి వస్తుందని వైసీపీ నేతలకు తెలుసు. అందుకే.. సైలెంట్ గా ఉన్నారు. కానీ టీఆర్ఎస్ కోసమే వారు లోపాయికారీగా పని చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
సీమాంధ్రులు ఎక్కువగా కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, కుత్భుల్లాపూర్, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో టీఆర్ఎస్ కు ఎక్కువగా డివిజన్లు వచ్చాయి. ఈ సక్సెస్ వెనుక ఆంధ్రప్రదేశ్ లోని అధికారపక్షం సహకారం ఉందని తెలంగాణ బీజేపీ నేతలకు సమాచారం అందింది. కొంతమంది వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలకు ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీ నేతల నుంచి ఫోన్లు వెళ్లడమే కాకుండా తెలంగాణలోని టీఆర్ఎస్ కు మద్ధతు ఇవ్వాలని సూచించినట్టు తెలిసింది. అక్కడ వ్యాపారాలు, పారిశ్రామిక రంగాల్లో స్థిరపడిన సీమాంధ్రులు అధికారంలో ఉన్న పార్టీతో వివాదం ఎందుకనే పరిస్థితిని కల్పించారు. ఒకవేళ టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్ధతు ఇవ్వకపోతే ఆంధ్రాలో ఉన్న మూలాలు, తమ వారికి ఇబ్బంది అవుతుందనే ఆలోచనతో సీమాంధ్రులు ఎక్కువమంది టీఆర్ఎస్ కు మద్ధతు ఇచ్చారని బీజేపీ నేతలు అనుమానిస్తున్నారు. కొన్ని చోట్ల రెడ్డి పరివార్ చేసిన సాయానికి గుర్తుగా ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు పోస్టర్లు.. ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నేతలు తెలంగాణ రాష్ట్ర సమితికి మద్దతు పలికినట్టు వచ్చిన వార్తలతోపాటుగా, కొన్ని సాక్ష్యాధారాలను కూడా సేకరించిన తెలంగాణ బీజేపీ నేతలు తమ పార్టీ హైకమాండ్ కు చేరవేశారని చెబుతున్నారు. ఈ అంశాలన్నింటిపై బీజేపీ అధిష్టానం కూడా తీవ్రంగా పరిగణించే అవకాశం ఉందంటున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం టీఆర్ఎస్కు టీడీపీనే సహకరించిందని అంటున్నారు. టీడీపీకి మద్దతుగా ఉన్న సామాజికవర్గం ఎక్కువగా ఉండే వైపే టీఆర్ఎస్ గెలిచిందని.. ఎల్బీనగర్ వైపు బీజేపీ గెలిచిందని గుర్తు చేస్తున్నారు.