ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి కేంద్రంలోని భాజపా తీరుపై తీవ్రమైన విమర్శలు చేశారు. అసెంబ్లీలో మరోసారి సుదీర్ఘంగా ప్రసంగించారు. భాజపా నేతలు చేసి వ్యాఖ్యల్ని ఒక్కోటిగా ప్రస్థావిస్తూ మాట్లాడారు. అమరావతి శంకుస్థాపనకు ప్రధానమంత్రి నరేంద్ర వచ్చినప్పుడు చేసిన ప్రసంగాన్ని చదివి వినిపించారు. ఆయన చెప్పిన మాటల్లో ఒక్క హామీ కూడా నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సెంటిమెంట్ తో డబ్బులు రావని చెప్పిన కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యల్ని కూడా మరోసారి తప్పుబట్టారు. సెంటిమెంట్ తోనే రాష్ట్రాన్ని విభజించిన విషయం వారికి గుర్తులేదా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా గురించి కూడా మరోసారి మాట్లాడారు.
హోదాకి సమానమైన ప్రయోజనాలన్నీ ప్యాకేజీ ద్వారా ఇస్తామని నాడు కేంద్రం చెప్పడంతో దానికి ఒప్పుకున్నామన్నారు. కానీ, ఇప్పుడు భాజపా నేతలు అన్యాయంగా మాట్లాడుతున్నారని చంద్రబాబు అన్నారు. ప్రత్యేక హోదా వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదని ఇప్పుడు వారు చెబుతుండటం సరికాదన్నారు. ఇప్పటికే హోదా అనుభవిస్తున్న రాష్ట్రాలు ప్రతీయేటా రాయితీలు, నిధులు పొందుతున్నాయనీ, కానీ, విభజన అనంతరం అన్ని విధాలుగా నష్టపోయిన ఆంధ్రాకి కూడా అవేవీ అవసరం లేదన్నట్టుగా భాజపా నేతలు మాట్లాడుతుండటం ఏమాత్రం సమంజసం కాదని చంద్రబాబు మండిపడ్డారు. విభజన చట్టంలో హామీలు, ప్రత్యేక హోదా ఆంధ్రులు హక్కు అని మరోసారి చంద్రబాబు చెప్పారు. ఈ మేరకు ఓ తీర్మాన్నాన్ని కూడా శాసన సభలో ఆమోదించారు.
నిజానికి, ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన సమయంలో హోదా వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని కేంద్రం చెప్పందీ, అదే బాటలో రాష్ట్ర నేతలూ మాట్లాడారు. కానీ, ఇప్పుడు వద్దునుకున్న హోదా వాదననే టీడీపీ భుజానికి ఎత్తుకోవాల్సి వచ్చింది. ఈ దశలో విపక్షాలు చాలా విమర్శలు చేస్తున్నాయి. టీడీపీ యూ టర్న్ తీసుకుందనీ, మాట మార్చిందనీ, ద్వంద్వ వైఖరనీ వైకాపా విస్తృతంగా ప్రచారం చేస్తోంది. దీంతో, ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం టీడీపీకి ఏర్పడిందనే చెప్పాలి. ఈ విషయంలో ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరణ ఇస్తూనే, ప్రతిపక్షం చేసే విమర్శ నుంచి అధికార పార్టీ బాగానే బయటపడింది అనుకోవచ్చు. ప్రత్యేక హోదాకి బదులు కేంద్రం ప్యాకేజీ ఇచ్చింది, కానీ ఇంతవరకూ ప్యాకేజీలో భాగంగా ఒక్కటంటే ఒక్క ప్రయోజనమూ దక్కలేదు. పైగా, కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రాకి ప్రాధాన్యత లేదు. అన్నిటికీ మించి 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల వల్లనే హోదా ఇవ్వడం లేదని చెప్పడమూ నిజం కాదని తేలింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదాను తాము మరోసారి డిమాండ్ చేయాల్సి వచ్చిందనే అంశాన్ని ఒకటికి రెండు సార్లు చంద్రబాబు చెబుతూ వచ్చారు. అందుకే, ప్రతీ సందర్భంలో ఈ అంశంపై వీలైనంత వివరంగానే మాట్లాడుతున్నారు.