2019 అసెంబ్లీ ఎన్నికలలో టిడిపి దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. సరిగ్గా దానికి ఏడాదిన్నర క్రితం నంద్యాల లో వై.య.స్.ఆర్.సి.పి సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానానికి జరిగిన ఉప ఎన్నికలలో భారీ విజయం సాధించిన టిడిపికి ఏడాదిన్నరలోనే ఫలితం ఇంత ప్రతికూలంగా రావడం పార్టీలో, పార్టీ అభిమానుల లోనే కాకుండా విశ్లేషకుల లో కూడా పెద్ద చర్చకు దారితీసింది. అయితే మరొక రకంగా చూస్తే నంద్యాల ఎన్నికలలో టిడిపి గెలవడమే పార్టీకి చేటు చేసింది అని కొంత మంది విశ్లేషకులు భావిస్తున్నారు.
నంద్యాల గెలుపు తో మితిమీరిన ఆత్మవిశ్వాసం:
నిజానికి నంద్యాల ఉప ఎన్నికల ముందు వరకు కూడా తెలుగుదేశం మీద ప్రభుత్వ వ్యతిరేకత ఉంది అంటూ జగన్ పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు. అయితే నంద్యాల ఉప ఎన్నికలలో టిడిపి గెలుపొందడంతో అప్పటిదాకా జగన్ చేసిన ప్రచారం మొత్తాన్ని టిడిపి తిప్పి కొట్టినట్లయింది. అయితే నంద్యాల విజయం తర్వాత తెలుగుదేశం పార్టీలో మితిమీరిన ఆత్మవిశ్వాసం కలగడం, ఆ మితిమీరిన ఆత్మవిశ్వాసంతో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఒక్క ఏడాదిన్నర కాలంలో పార్టీ పరిస్థితి తలకిందులు చేశాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ని దూరం చేసుకోవడానికి సిద్ధపడడం:
నంద్యాల ఉప ఎన్నికల ఫలితాల తర్వాతే పవన్ కళ్యాణ్ మీద టిడిపి అనుకూల మీడియా గా ముద్రపడ్డ కొన్ని చానల్స్ లో వ్యక్తిత్వ హనన కార్యక్రమాలు మొదలవడం గమనార్హం. పవన్ కళ్యాణ్ ని చీల్చి చెండాడుతూ, అదేపనిగా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ వచ్చిన ఆ కార్యక్రమాలలో మాట్లాడిన వ్యక్తులు వైసిపి సానుభూతిపరులు అయినప్పటికీ, ఆ కార్యక్రమాలను సాక్షి ఛానల్ ప్రోత్సహించక పోగా, టిడిపి అనుకూల చానల్స్ గా ముద్రపడ్డ ఛానల్స్ ఆ వ్యక్తులను విపరీతంగా ప్రోత్సహించడంతో పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం అని చాలామంది భావించారు. అయితే ఎన్నికల లోపు పవన్ కళ్యాణ్ ని దారిలోకి తెచ్చుకోవడానికి అలా చేశారా, లేదంటే నంద్యాల ఉపఎన్నిక ఫలితాల తర్వాత జగన్ తేలిపోయాడు కాబట్టి, పవన్ కళ్యాణ్ ని కూడా దెబ్బ తీస్తే తాము ఘన విజయం సాధించవచ్చు అన్న భ్రమతో అలా చేశారా అన్నది చెప్పలేకపోయినప్పటికీ, జనం మాత్రం పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వ హనన ప్రోగ్రామ్స్ వేసిన చానల్స్ కి టిడిపి అండదండలు ఉన్నాయని భావించారు. దీనికి తోడు పవన్ కళ్యాణ్ కూడా కొంతమంది మీడియా పెద్దలను తెలుగుదేశం పార్టీ అధినేతలను ఇందుకు బాధ్యులుగా చేస్తూ తీవ్ర విమర్శలు చేయడంతో అప్పటిదాకా తాము భావించినట్టుగానే ఎపిసోడ్ వెనకాల ఉన్నది టీడీపీ అని జనం ఫిక్స్ అయ్యారు. అయితే, ఒకవేళ నంద్యాల ఉప ఎన్నికలలో గనక తెలుగుదేశం పార్టీ ఓడిపోయి ఉన్నట్లయితే, పవన్ కళ్యాణ్ ని దూరం చేసుకొనే సాహసం తెలుగుదేశం పార్టీ చేసి ఉండేది కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. అదీకాకుండా, ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం పై పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకు పడటంతో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తారాస్థాయికి చేరింది.
నంద్యాల గెలుపు తర్వాత అవినీతి తారాస్థాయికి చేరిందా?
భారతదేశంలోని ఏ రాష్ట్రంలోని ఏ ప్రభుత్వాన్ని తీసుకున్నా, అవినీతి అనేది సర్వసాధారణం అయిపోయింది. ఇందుకు తెలుగుదేశం ప్రభుత్వం మినహాయింపు కాదు. అయితే నంద్యాల గెలుపు తర్వాత జగన్మోహన్రెడ్డి పని అయిపోయిందంటూ రాజకీయ వర్గాల్లో జరిగిన ఒక ప్రచారం తెలుగుదేశం నాయకుల లో మితిమీరిన ఆత్మ విశ్వాసాన్ని కలిగించడం, కొందరు నేతలు బాహాటంగానే తదుపరి ఎన్నికల కోసం తాము పాతిక కోట్లు ఒక నియోజకవర్గానికి సిద్ధం చేసుకున్నానని చెప్పడం లాంటివి జరిగాయి. గ్రామస్థాయి తెలుగుదేశం నాయకులో సైతం వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి తిరుగులేదు అనే అహంకార ధోరణి ఏర్పడడం, దాంతో అవినీతి తారా స్థాయికి చేరడం పార్టీ కొంప ముంచాయని చెప్పవచ్చు.
మొత్తం మీద చూస్తే:
మొత్తం మీద చూస్తే నంద్యాల గెలుపు తెలుగుదేశం పార్టీకి మితిమీరిన ఆత్మ విశ్వాసాన్ని తీసుకురావడం, తప్పుడు వ్యూహాలు వేసేలా ప్రోత్సహించడం చేసినట్లుగా కనిపిస్తోంది. ఒకవేళ నంద్యాల ఎన్నికల్లో నే కనక టిడిపి పరాజయం పాలై ఉంటే, పార్టీ దిద్దుబాటు చర్యలు ముందుగానే మొదలుపెట్టి ఉండేదని, వ్యూహాలు మరొక రకంగా ఉండేవని, అప్పుడు 2019 ఎన్నికలలో గెలవకపోయినా కూడా మరీ ఇంత ఘోరంగా అయితే అపజయం పాలై ఉండేది కాదని విశ్లేషకులు భావిస్తున్నారు