పార్లమెంటు సమావేశాలకు మరో రెండ్రోజులు మాత్రమే గడువుంది. ఈలోగా ఆంధ్రాకు సంబంధించి కేంద్రం నుంచి సానుకూల ప్రకటనలేవీ వెలువడే పరిస్థితి దాదాపు కనిపించడం లేదు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చొరవ తీసుకున్నా… తూతూ మంత్రంగానే భాజపా అధ్యక్షుడు అమిత్ షా, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగింది. కేంద్రంపై పోరాటం విషయమై అనుసరించాల్సిన వ్యూహాన్ని ఈ సమావేశంలో ఏపీ సర్కారు చర్చించింది. 5 నుంచి జరగబోయే సమావేశాలను మరోసారి స్తంభింపజేయాలని టీడీపీ నిర్ణయించింది. గత సమావేశాల్లో అనుసరించిన వ్యూహంతో జాతీయ స్థాయిలో ఏపీకి జరిగిన అన్యాయం గురించి చాటిచెప్పినట్టయిందనీ, ఇప్పుడు అదే స్థాయిలో మద్దతు కూడగట్టాలని టీడీపీ నిర్ణయించినట్టు సమాచారం. రాష్ట్ర ప్రయోజనాల విషయమై ఇకపై జాతీయ స్థాయిలోనే పోరాటం తీవ్రతరం చేయాలని సీఎం అభిప్రాయపడ్డారని తెలుస్తోంది.
ఈ పోరాటంలో భాగంగా జాతీయ పార్టీలతోపాటు, దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలకు లేఖలు రాయాలని నిర్ణయించారు. ఈ లేఖల ద్వారా ఏపీకి భాజపా సర్కారు ఇచ్చిన హామీలతోపాటు, విభజన చట్టంలోని అంశాలను కూలంకషంగా వివరించబోతున్నారు. 5 నుంచి ప్రారంభం కాబోతున్న లోక్ సభ సమావేశాల్లో అన్ని పార్టీలనూ కలుపుకుని కేంద్రంపై పోరాటం సాగించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయనే అంశంపై ఎంపీలు చంద్రబాబుకు వివరించారు. ప్రజలు కూడా కేంద్రంపై పోరాటానికి మద్దతుగా నిలించేందుకు సిద్ధంగా ఉన్నారనే అభిప్రాయం వ్యక్తమౌతోందని ఎంపీలు తెలిపారు. ఏపీకి రెండో రాజధాని అవసరమంటూ భాజపా నేతలు కర్నూలు డిక్లరేషన్ పేరుతో ఒక నోట్ విడుదల అంశం చర్చకు వచ్చింది. దీనిపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగుదేశం పార్టీకి మొదట్నుంచీ సంక్షోభాలను ఎదుర్కోవడం కొత్త కాదనీ, ఇలాంటి సమయంలో కూడా అవకాశాలు సృష్టించుకుంటామని చంద్రబాబు అభిప్రాయపడ్డారని సమాచారం. రాష్ట్ర ప్రయోజనాల కోసం మరో సంక్షోభాన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్టు సీఎం తెలిపారు. ప్రత్యేక హోదాపై మాట్లాడుతూ… ఇతర రాష్ట్రాలకు హోదా పెంచే యోచనలో కేంద్రం ఉందనీ, ఒకవేళ పొడిగిస్తే ఆంధ్రాకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని తాను కోరానని చంద్రబాబు వివరించినట్టు తెలుస్తోంది. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పి, ఇంతవరకూ ఎలాంటి కేటాయింపులూ చేయలేదనీ.. హోదాకు బదులుగా ఇస్తామన్న ప్యాకేజీపై ఎలాంటి స్పందనా లేనప్పుడు.. ఇప్పుడు హోదా కోసమే పోరాడాలన్నది పార్టీ నిర్ణయమని ఎంపీ గల్లా జయదేవ్ అభిప్రాయపడ్డారు. మరి, జాతీయ స్థాయిలో పోరాటం అంటున్న టీడీపీకి ఏయే పార్టీలు మద్దతుగా వస్తాయో వేచి చూడాలి.