మూడు రాజధానుల నిర్ణయాన్ని తిరస్కరించడానికి.. తెలుగుదేశం పార్టీ అనూహ్యమైన మార్గన్ని శానసమండలిలో ఎంచుకుంది. టీడీపీ ఊహించని స్టెప్ వేయడంతో.. అవాక్కయిన అధికారపక్షం.. వెంటనే.. శాసనమండలి ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేయించింది. టీడీపీ వేసిన ప్లాన్ రూల్ నెం 71. మండలి ప్రారంభం కాగానే.. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టారు. అప్పుడే.. టీడీపీ పక్ష నేత యనమల రామకృష్ణుడు రూల్ నెం 71 ప్రకారం తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తిరస్కరించే అవకాశం రూల్ నెంబర్ 71వల్ల కలుగుతుంది. మండలిలో మెజార్టీ ఉంటే.. రూల్ నెంబర్ 71కింద తీర్మానం ప్రవేశ పెట్టవచ్చని తేలింది. వెంటనే.. మెజార్టీని శాసనమండలి లెక్కించడంతో తీర్మానం ప్రవేశపెట్టేందుకు బలం ఉందని నిర్ధారణ అయింది.
రూల్ 71కు మద్దతుగా 30 మంది ఎమ్మెల్సీలు నిలబడ్డారు. తీర్మానంపై చర్చను ఆమోదిస్తే ప్రభుత్వ నిర్ణయాన్ని తిరస్కరించినట్టే అవుతుంది. టీడీపీ ఈ రూట్లో వస్తుందని అంచనా వేయలేకపోయిన అధికారపక్షం.. తత్తరపాటుకు గురైంది. ఈ రూల్ కింద.. తీర్మానం పెట్టే అధికారం లేదని.. బుగ్గన వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే.. మండలి ప్రసారాలు నిలిచిపోయాయి. అయితే.. సాంకేతిక కారణాల వల్లే ప్రసారాలు నిలిచిపోయాయని.. ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ప్రభుత్వం అభ్యంతరం తెలిపినప్పటికీ.. రూల్ నెంబర్ 71 కింద… మండలి చైర్మన్ చర్చకు అనుమతించారు. ప్రభుత్వ తీరుపై యనమల ఓ సందర్భంలో మండిపడ్డారు.
తమ ఎమ్మెల్సీలకు.. వైసీపీ నేతలు ఫోన్లు చేయాల్సిన అవసరం ఏమి వచ్చిందని ప్రశ్నించారు. శాసనమండలిలో.. వికేంద్రీకరణ బిల్లును తిరస్కరిస్తారన్న నమ్మకం ఉండటంతో.. ఎలాగోలా గెలిపించుకోవాలన్న ఉద్దేశంతో వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఎంపీ విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి శాసనమండలి వీఐపీ గ్యాలరీ నుంచి సమావేశాలను పరిశీలిస్తున్నారు.