కొత్త ఏడాది రాగానే ఎన్నికల హడావుడి మెల్లగా మొదలౌతుంది. నిజానికి, ఇప్పటికే ఏపీలో ఎన్నికల వేడి మొదలైందనే చెప్పాలి. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. మరో ఏడాదిలో తమ పార్టీ అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో పెద్ద ఎత్తున హామీలు ఇచ్చేస్తున్నారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే పెన్షన్లు, పేదలకు ఇళ్లు, విద్య, వైద్యం వంటి అంశాలపై ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. ఇంకోపక్క, టీడీపీ సర్కారు ఇచ్చిన హామీలపై కూడా జగన్ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, టీడీపీ కూడా వీటిపైనే ప్రత్యేక శ్రద్ధ పెట్టేందుకు కసరత్తు మొదలుపెట్టిందని చెప్పాలి. వచ్చే బడ్జెట్ కు సంబంధించిన కసరత్తు అప్పుడే మొదలైంది. ఎన్నికలు దగ్గరపడుతూ ఉండటంతో సంక్షేమ పథకాలు, గతంలో ఇచ్చిన హామీల అమలు వంటి అంశాలకే రాబోయే బడ్జెట్ లో పెద్దపీట వేయనున్నారు.
బాబు వచ్చినా జాబు రాలేదనేది జగన్ ప్రధాన విమర్శ. నిరుద్యోగ భృతి ఇంటింటికీ బాకీ ఉన్నారంటూ లెక్కలు కూడా చెప్తుంటారు. ఈ విమర్శలకు చెక్ పెట్టే విధంగా వచ్చే నెలలోనే నిరుద్యోగ భృతి సంబంధించిన విధాన ప్రకటన ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. యువత నుంచి నేరుగా సలహాలు తీసుకుంటూ.. భృతి అమల్లోకి తీసుకొచ్చే దిశగా కసరత్తు జరుగుతోంది. ఇక, జగన్ విమర్శల్లో మరో ప్రధానమైంది… చంద్రబాబు నాయుడు ఒక్క పేదవాడికైనా ఇళ్లు కట్టించారా అనేది..! ఈ మధ్య నిర్వహించిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో కూడా ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన డిమాండ్ ఇంకా వినిపిస్తోందనీ, దీంతో రాబోయే బడ్జెట్ లో గృహనిర్మాణానికి భారీ ఎత్తున నిధులు కేటాయించబోతున్నారని అంటున్నారు.
జగన్ విమర్శిస్తున్న మరో కీలకాంశం.. అర్హులైనవారికి చంద్రబాబు సర్కారు పెన్షన్లు ఇవ్వడం లేదని. దీనికి కూడా చెక్ పెట్టేందుకు… కొత్తగా కావాలంటూ వస్తున్న డిమాండ్లన్నింటికీ పరిశీలించి, పెన్షన్లు మంజూరి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం దగ్గరున్న అంచనా ప్రకారం మరో ఏడు శాతం మందికి కొత్తగా పెన్షన్లు ఇచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. ఇక, జగన్ ఆరోపణల్లో మరో కీలకమైంది… చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చాక రేషన్ దుకాణాల్లో చౌక ధరల సరుకులు దొరకడం లేదనీ! వచ్చే నెల నుంచి రేషన్ దుకాణాల ద్వారా కందిపప్పు, పంచదారలతోపాటు వీలైనన్ని నిత్యావసరాలు అందుబాటులోకి తెచ్చే చర్యలూ చేపట్టేంది. మొత్తంగా, ఈ అంశాలకు వచ్చే బడ్జెట్లో భారీ మొత్తంలో కేటాయింపులు ఉండే దిశగా ఆర్థిక శాఖ కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఏదైతేనేం, బడ్జెట్ తయారీలో ప్రజల అవసరాలూ, దీర్ఘకాలిక ప్రయోజనాలు అనే అంశాలకంటే.. రాజకీయ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తూ ఉండటం గమనార్హం.