భారత రాష్ట్ర సమితి ఏపీపై కాసిని ఆశలు పెట్టుకున్నట్లుగానే కనిపిస్తోంది. ఏపీలో కొంత మంది నేతలతో బంధుత్వాలు ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ఏపీలో బీఆర్ఎస్ కార్యక్రమాలకు ఇంచార్జ్‌గా నియమించారు. మాజీ టీటీడీ చైర్మన్ సుధాకర్ యాదవ్, యనమల రామకృష్ణుడులకు తలసాని బంధువు. అయితే వీరి వల్ల తలసానికి ఒరిగేదేమీ ఉండదు. కానీ.. ఏపీలో రాజకీయం చేయడానికి ఓ యాక్సెస్ లాగా ఉపయోగపడుతుంది. సంక్రాంతి తర్వాత ఏపీలో ఓ బహిరంగసభ పెట్టాలనుకుంటున్నట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. దీని బాధ్యత తలసానికే ఇచ్చారు.
ఇప్పటికే తలసాని .. ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం.. పార్టీ ఆఫీసు కోసం స్థలాన్ని సమీకరించడంలో సక్సెస్ అయ్యారు. ఇక పార్టీ కార్యాలయాన్ని నిర్మించాల్సి ఉంది. అయితే బీఆర్ఎస్ కదలికలు ఏపీలో ఎంత ఎక్కువ అయితే.. తెలుగుదేశం పార్టీకి అంత ప్లస్ అవుతుందని.. తెలంగాణలో నిరాటకంగా అన్ని జిల్లాల్లోకి చంద్రబాబు చొచ్చుకెళ్లగలగుతారని అంటున్నారు. సెంటిమెంట్ రేపే అవకాశం కూడా ఉండదని.. ఎందుకంటే.. ఏపీలో కేసీఆర్ తిరుగుతారు కాబట్టి.. సమాధానం చెప్పుకోలేరని అంటున్నారు. కేసీఆర్ బీఆర్ఎస్ ప్రణాళిక ప్రకటించిన వెంటనే చంద్రబాబు టీ టీడీపీని యాక్టివ్ చేశారు.
కాసాని జ్ఞానేశ్వర్ ను టీ టీడీపీ అధ్యక్షుడిగా చేసిన తర్వాత అనూహ్యంగా చేరికలు పెరిగిపోతున్నాయి. ఖమ్మంలో భారీ బహిరంగసభ ప్లాన్ చేస్తున్నారు. కొంత మంది సీనియర్లు తిరిగి రావొచ్చన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఏపీలో బీఆర్ఎస్ వ్యవహారాలు పెరిగితే.. టీడీపీకి మరింత ధైర్యం వస్తుంది. తెలంగాణలో కనీసం టీడీపీకి బలం ఉన్న ఉమ్మడి ఖమ్మం.. గ్రేటర్ హైదరాబాద్, మహబూబ్ నగర్, నల్లగొండ వంటి జిల్లాల్లో పోటీ చేయడానికి అవకాశాలు ఉంటాయి. అప్పుడు టీఆర్ఎస్కు విమర్శించడానికి కూడా చాన్స ఉండదు.
అయితే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ విషయంలో ఎలాంటి ప్రణాళికలతో ఉన్నారన్న దానిపై స్పష్టత లేదు. ఆయనకు ఏపీ నుంచి ఓ మాదిరి లీడర్లు దొరకడం కూడా కష్టమే. బహిరంగసభ పెడితే వచ్చే వారు ఎవరుంటారన్నది ఆలోచించారు. కానీ చంద్రబాబు తెలంగాణలో బహిరంగసభలు పెడితే పరిస్థితి వేరుగా ఉంటుంది. అందుకే.. ముందు ముందు రాజకీయం వేడేక్కే అవకాశం ఉంది.