తెలుగుదేశం పార్టీకి బీసీల పార్టీ అనే పేరు ఉంది. పార్టీ పెట్టినప్పటి నుండి బీసీలు టీడీపీకి అండగా ఉంటున్నారు. పార్టీకి కష్టం వచ్చి ప్రతిసారి వెన్నుదన్నుగా నిలిచారు. రాష్ట్ర విభజన తరువాత బలమైన బీసీ నేతలు తెలంగాణలో ఉండిపోయరాు. 136 బీసీ కులాలను ఏకం చేసే నేతలు ఏపిలో పార్టీకి కరువయ్యారు. దీంతో వారందరిని తిరిగి ఏక తాటిపైకి తీసుకు వచ్చి, తిరిగి తెలుగుదేశానికి కోండంత అండగా నిలిచేలా చేసేందుకు టీడీపీ కసరత్తు ప్రారంభించింది. ఆదరణ -2 లాంటి పథకాలతో కొత్త ప్రయత్నాలు చేస్తోంది. అన్ని బీసీ కులాలను ఒకే వేదికపైకి తెచ్చేందుకు జయహో బీసీ కార్యక్రమాన్ని రాజమహేంద్రవరంలో భారీగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కొత్త పథకాలను.. చంద్రబాబు ప్రకటించబోతున్నారు. ప్రత్యేకంగా కొన్ని సామాజికవర్గాలకు కార్పొరేషన్ లను ఏర్పాటు చేయనున్నట్లు వరం ఇచ్చే అవకాశం ఉంది. శెట్టి బలిజ, యాదవ, కురుమ, చేనేతలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయడానికి ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు.
తెలుగదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహనాడులో సైతం బీసీ కులవృత్తులకు ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. ఇప్పటి వరకూ రాజకీయ ప్రాధాన్యం లేని బీసీ కులాలకు సైతం ఏదో రూపంలో ప్రాధాన్యం కలిగించిన పార్టీ తెలుగుదేశం అనే విషయాన్ని గొప్పగా జయహో బీసీ సదస్సులో ప్రకటించనుంది. జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీ కులాల అనైక్యత వల్ల నష్టపోతున్న విషయాన్ని వివరించడంతో పాటు వారి రాజకీయ అభ్యున్నతికి టీడీపీ చేసిన కృషిని జయహో బీసీ సభ ద్వారా వెల్లడించనుంది. టీడీపీకి రాష్ట్ర విభజన తరువాత మారిన సమీకరణలు కోత్త ఇబ్బందులు తెచ్చి పెట్టాయి. దీంతో బిసి రిజర్వేషన్లకు ఇబ్బంది లేకుండానే మిగిలిన కులాలకు న్యాయం చేస్తామంటూ టీడీపీ బిసిలకు భరోసా ఇచ్చి.. రాజకీయంంగా మద్దతు మరింత పెంచుకోవాలని సిద్ధమయింది.
నిజానికి తెలుగుదేశం పార్టీకి ఉన్న బీసీల మద్దతును..తగ్గించేందుకు తెలంగాణ నుంచి కేసీఆర్… తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో.. ఆయన తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కూడా.. ఏపీకి పంపించారని.. త్వరలోనే మరికొంత మందిని ప్రయోగించే అవకాశం ఉందని అంటున్నారు. ఏపీలో కాపుల రిజర్వేషన్ల అంశం వచ్చినప్పుడు… ఆర్.కృష్ణయ్య లాంటి నేతలు ఏపీలో హడావుడి చేసే ప్రయత్నం చేశారు. బీసీలకు ఎలాంటి అన్యాయం జరగుకుండా.. వారి కోటాలో ఎలాంటి మార్పుల్లేకుండా.. కాపు రిజర్వేషన్లు ఇస్తున్నామని … ప్రభుత్వం స్పష్టంగా చెప్పినప్పటికీ… ఆర్.కృష్ణయ్య.. ఆందోళనలు చేసే ప్రయత్నం చేశారు. ఎవరూ పట్టించుకోకపోవడతో వెనక్కి తగ్గారు. మారిన రాజకీయ పరిణామాలతో.. బీసీల్లో ఉన్న మద్దతును కాపాడుకోవాల్సిన పరిస్థితి టీడీపీపై పడింది. అందుకే.. ఎన్నికల ముందు బీసీలకు టీడీపీ చేసిన మేలును మరోసారి గుర్తు చేసి.. మరిన్ని వరాలు ప్రకటించి.. వారి మద్దతును మరింతగా పొందడానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. దానికి జయహో బీసీ సదస్సును ఉపయోగించుకుంటున్నారు.