తెలంగాణలో పార్టీ బలోపేతంపై టీడీపీ దృష్టిసారించింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని భావిస్తోన్న టీడీపీ ఘర్ వాపసీకి శ్రీకారం చుట్టి చేరికలను ప్రోత్సహించాలనుకుంటోంది. ఇందుకోసం కొంతమంది నేతలకు ఫోన్లు కూడా వెళ్ళినట్లు సమాచారం.
ఏపీలో చంద్రబాబు సారధ్యంలోని కూటమి ఘన విజయంతో తెలంగాణ టీడీపీలో ఆశలు చిగురిస్తున్నాయి. పార్టీ పునర్ వైభవంపై ఇక నుంచి ఫోకస్ పెడుతానని చంద్రబాబు వ్యాఖ్యలతో ఆ పార్టీ నేతల్లో భవిష్యత్ పై ధీమా పెరగగా…ఇతర పార్టీలో కొనసాగుతోన్న నేతలను ఆకర్షించే పనిలో పడింది టీడీపీ.
రాష్ట్ర విభజన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో టీడీపీ నేతలు ఇతర పార్టీలోకి జంప్ చేశారు. ఎక్కువగా బీఆర్ఎస్ లో చేరగా.. ఆ పార్టీ అధికారం కోల్పోవడంతో అసంతృప్తిగా ఉన్న నేతలను గుర్తించి టీడీపీలో చేర్చుకోవాలని భావిస్తున్నారు. ఈమేరకు కొంతమంది టీడీపీ మాజీలకు మంగళగిరి నుంచి ఫోన్లు కూడా వెళ్ళినట్లు తెలుస్తోంది.
టీడీపీ మాజీ నేతలు ప్రస్తుతం ఏయే పార్టీలో ఉన్నారు..? ఎవరెవరు అసంతృప్తిగా ఉన్నారు..? టీడీపీలోకి వచ్చేందుకు సుముఖంగా ఉన్నారా…?అనే విషయాలపై టీడీపీ నేతలు ఆరా తీస్తున్నారు. గ్రేటర్ లో ఇప్పటికీ పార్టీకి పట్టు సడలలేదని..అందుకే హైదరాబాద్ పరిధిలో కీలకంగా పని చేసే నేతలను పార్టీలో చేర్చుకోవాలని టీడీపీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.