వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి సామాజికవర్గ నేతలను ఆకట్టుకోవడానికి టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నట్లే కనిపిస్తున్నాయి. జగన్ సొంత జిల్లా కడపలోని జమ్మలమడుగు వైసిపి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సైకిల్ ఎక్కడానికి సిద్దమయ్యారు. తాను టిడిపిలో చేరడానికి సిద్దంగా ఉన్నానని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఆదినారాయణరెడ్డి టిడిపిలో చేరడానికి సిద్దమవ్వడం లోకేష్ జరిపిన మంత్రాంగం ఫలితమే. జమ్మలమడుగు ఎమ్మెల్యేని టిడిపిలో చేర్చుకోవడం ద్వారా జగన్ ను నైతికంగా దెబ్బతీయాలని టిడిపి నాయకత్వం భావిస్తోంది. వైసిపి ఎమ్మెల్యేగా ఉన్న ఆదినారాయణరెడ్డితో ఆ పదవికి రాజీనామా చేయించి టిడిపి అభ్యర్ధిగా పోటీ చేయించి గెలిపించుకుంటే కడపలో పార్టీకి పట్టు పెరుగుతుందన్నది టిడిపి బాస్‌ల వ్యూహం. అయితే జమ్మలమడుగు టిడిపి నేత ,మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. దాంతో రామసుబ్బారెడ్డికి సముచిత పదవి ఇచ్చి ఆయన్ని ఒప్పించే ప్రయత్నాలు చేస్తోంది టిడిపి అధిష్టానం. ఆ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తున్నట్లే కనిపిస్తున్నాయి.
రామసుబ్బారెడ్డిని ఒప్పించకుండా ఆదినారాయణరెడ్డిని పార్టీలో చేర్చుకుని … టిడిపి అభ్యర్ధిగా పోటీ చేయిస్తే ఫలితం తారుమారయ్యే పరిస్థితి ఉంది. ఆదినారాయణరెడ్డికి రామసుబ్బారెడ్డి సపోర్ట్ చేస్తే జమ్మలమడుగులో ఇక టిడిపి విజయానికి ఎదురుండదు . అదే జరిగితే జగన్‌కు మోరల్‌గా పెద్ద దెబ్బే. ఆ లెక్కలతోనే లోకేష్ ఈ వ్యవహారంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారంటున్నాయి పార్టీ వర్గాలు. ఏది ఏమైనా నయానో, భయానో రామసుబ్బారెడ్డిని ఒప్పించి ఆదినారాయణరెడ్డిని టిడిపిలోకి తీసుకోవడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. ఆదినారాయణరెడ్డి చేరికకు ముహూర్తం ఖరారైతే ఆయనతో పాటు కడప జిల్లాకు చెందిన మైదుకూరు వైసిపి ఎమ్మెల్యే రఘురామిరెడ్డి కూడా పసుపు కండువా కప్పుకోవడానికి తయారుగా ఉన్నారంట.
మరోవైపు చిత్తురు జిల్లాలో రెడ్డి సామాజిక వర్గ నేతలను టిడిపిలో చేర్చుకోవడానికి లోకేష్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నట్లే కనిపిస్తున్నాయి. ఈ జిల్లాకు చెందిన మాజీ సీఎం కిరణకుమార్రెడ్డి రాజకీయంగా సైలెంట్ అయిపోయారు. దాంతో రాజకీయ ఉపాధి కోసం కిరణ్‌కు స్వయానా సోదరుడైన కిషోర్‌కుమార్‌రెడ్డి తన టీంతో సైకిల్ సవారీకి రెడీ అవుతున్నారు. కిషోర్‌తో పాటు పుంగనూరుకు చెందిన మాజీ ఎంఎల్‌సి రెడ్డప్పరెడ్డి, తంబళ్లపల్లి మాజీ ఎమ్మెల్యే కలిచర్ల ప్రభాకరరెడ్డి, డిసిసిబి ఛైర్మన్ అమాచ రాజశేఖరరెడ్డి, మదనపల్లి మున్సిపాల్టీ మాజీ ఛైర్మన్ నరేష్‌కుమార్‌రెడ్డి వంటి వారు కూడా తెలుగుదేశంలో చేరడానికి సిద్దంగా ఉన్నారు.