పేదలకు 30 లక్షల ఇళ్ల పట్టాలిస్తామంటూ హడావుడి చేసిన వైసీపీ సర్కార్… ఏడాదిన్నర గడిచిపోయినా ఆ దిశగా కనీసం అడుగులు వేయలేకపోయింది. ఆ పేరుతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్న అభిప్రాయం మాత్రం ప్రజల్లో ఏర్పడింది. ఈ విషయంలో వైసీపీ కన్నా టీడీపీనే ఎక్కువగా పని చేసిందన్న అభిప్రాయం కల్పించడానికి .. టీడీపీ ఉద్యమం ప్రారంభించాలని నిర్ణయించింది. సంక్రాంతికి డెడ్ లైన్ పెట్టింది. టీడీపీ హయాంలో నిర్మించిన మూడున్నర లక్షల ఇళ్లను.. తక్షణం వారికి కేటాయించకపోతే.. తాము స్వయంగా గృహప్రవేశాలు చేయిస్తామని డెడ్ లైన్ విధించింది. టీడీపీ నేతలు ఇప్పటి నుంచి దాని కోసం కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు.
కట్టిన ఇళ్ల దగ్గరకు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. మరో వైపు లబ్దిదారుల్లోనూ అసహనం పెరిగిపోతోంది. ఆ ఇళ్లన్నీ వంద శాతం ప్రభుత్వం ఉచితంగా ఇచ్చినవి.. ఇస్తున్నవి కాదు. లబ్దిదారులు డీడీలు కట్టాలు. వడ్డీలకు తెచ్చుకుని ఇళ్లు వస్తున్నాయన్న ఆశతో కట్టారు. దాదాపుగా పూర్తయ్యాయి. రోడ్లు, నీరు లాంటి మౌలిక వసతులు కల్పించి ప్రభుత్వం ఇస్తుందని అనుకున్నారు. కానీ అసలుకే మోసం తెచ్చేసింది జగన్ సర్కార్. వాటన్నింటినీ ఆలా పాడు పెట్టేస్తోంది. అవి నిరుపయోగగంగా ఉండి శిథిలం అవుతున్నాయి. వాటిని వదిలేసి ఇళ్ల స్థలాలిస్తామంటూ వైసీపీ నేతలు హడావుడి చేస్తున్నారు.
కానీ చట్ట బద్దంగా ఇవ్వకుండా… చట్టంలో లేని హక్కులతో ఇస్తామంటూ… కొత్త కొత్త ప్రయత్నాలు చేయడంతో కోర్టు కేసుల్లో పడ్డాయి. దీంతో వారికి అటు ఇళ్లూ దక్కడం లేదు.. ఇటు స్థలాలూ అందడం లేదు. ఈ కారణంగా లబ్దిదారుల్లో అసహనం పెరిగిపోతోంది. దీన్ని టీడీపీ ఉపయోగించుకుని ప్రజాఉద్యమానికి సిద్ధమవుతోంది. సంక్రాంతిలోపు ఇళ్ల పంపిణీ చేయకపోతే.. రచ్చ రచ్చ అయ్యే అవకాశం ఉంది.