స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం రహస్య జీవోలతో ఏదో తప్పు చేస్తున్నట్లుగా వ్యవహారాలు చక్కబెడుతూండటంతో తెలుగుదేశం.. మరింత వ్యూహాత్మకంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటి వరకూ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టుకు వెళ్లాలని డిమాండ్ చేస్తూ వచ్చిన టీడీపీ.. హఠాత్తుగా… స్వయంగా సుప్రీంకోర్టులోస్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గింపుపై ఎంపీ రామ్మోహన్నాయుడు, కొల్లు రవీంద్ర సహా టీడీపీ ముఖ్యనేతలంతా కలిసి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం మొత్తంగా అన్ని వర్గాలకు కలిపి యాభై శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ.. ప్రభుత్వ కాన్ఫిడెన్షియల్ జీవో జారీ చేసింది. దీని ప్రకారం… జనాభాలో సగం మందికిపైగా ఉన్న అన్ని బీసీ కులలాకు కలిపి 25 శాతమే రిజర్వేషన్ దక్కనుంది.
ఇది ఆయా వర్గాలకు తీవ్ర అన్యాయం చేయడమేనన్న అభిప్రాయంతో ఉన్న టీడీపీ.. సుప్రీంకోర్టులో పోరాడాలని నిర్ణయించుకుంది. 59శాతం రిజర్వేషన్ల అంశాన్ని హైకోర్టు కొట్టి వేసిన సుప్రీంకోర్టుకు వెళ్లకపోవడాన్ని టీడీపీ తప్పు పడుతోంది. సొంత కేసులకు పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకుంటున్న జగన్. బీసీ రిజర్వేషన్లపై సమర్ధుడైన లాయర్‌ను నియమించలేదని.. బీసీలకు రాజ్యాధికారం దక్కకూడదన్న దురుద్దేశంతో జగన్ కుట్రలు పన్నుతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. ఎన్నికల షెడ్యూల్‌ను వీలైనంత త్వరగా ప్రకటించి.. నెలాఖరులోపు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం పట్టదలగా ఉంది.
యాభై శాతంలోపు రిజర్వేషన్లను ఖరారు చేసే ప్రయత్నంలో .. ప్రస్తుతం అధికారయంత్రాంగం నిమగ్నమై ఉంది. ఈ లోపు సుప్రీంకోర్టులో టీడీపీ నేతలు వేసిన పిటిషన్ విచారణకు వస్తే.. ఎన్నికల ప్రక్రియపై స్టే ఇస్తే మాత్రం ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. బీసీల విషయంలో రాజకీయంగా వైసీపీని ఇరుకున పెట్టడానికి టీడీపీ గట్టి ప్రయత్నలే చేస్తోంది.