కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించుకోవాలని పట్టుదలగా ఉంది. ఎవరు వ్యతిరేకించినా ఆ బిల్లును ఆమోదించుకోవడం ఖాయం. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా ముస్లింల ప్రయోజనాలు కాపాడేలా నాలుగు కీలక సవరణలను కోరింది. వాటికి కేంద్రం తప్పనిసరిగా ఆమోద ముద్ర వేసేలా చేసింది. ఈ నాలుగు సవరణలతో ముస్లింలకు ఈ బిల్లుపై ఉన్న అభ్యంతరాలు చాలా వరకూ పరిష్కారం అవుతాయి.
ముస్లింల ప్రయోజనాల కోసం చంద్రబాబు విస్తృత మంతనాలు
కేంద్రం వక్ఫ్ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ కి పంపినప్పటి నుంచి చంద్రబాబు,పార్టీ నేతలతో విస్తృతంగా చర్చలు జరిపారు. ముఖ్యంగా మైనార్టీ నేతలతో ఆ బిల్లులో ఉన్న అభ్యంతరకర అంశాల గురించి తెలుసుకున్నారు. చివరికి వారికి ఎలాంటి అపోహలు లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా నాలుగు సవరణలు చేయాలని ప్రతిపాదించారు. ఆ మేరకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందు ఆ నాలుగు సవరణలు పెట్టి వాటిలో మూడు ఆమోదించేలా చేశారు.
వక్ఫ్ డీడ్ లేకపోయినా వక్ఫ్ ఆస్తులే !
వక్ఫ్ బిల్లుపై ప్రధానంగా వస్తున్న అభ్యంతరం.. వక్ఫ్ ఆస్తుల్ని పత్రాలు లేవన్న కారణంగా ప్రభుత్వాలు స్వాధీనం చేసుకుంటాయనే. చంద్రబాబునాయుడు చొరవతో ఈ విషయంలో బిల్లులో కీలక సవరణలు చేసింది. యూజర్ ద్వారా వక్ఫ్ .. ఇప్పటికే ‘వక్ఫ్ బై యూజర్’ గా నమోదు చేసిన వక్ఫ్ ఆస్తుల కేసులు తిరిగి తెరిచే అవకాశం లేదు. వాటికి వక్ఫ్ డీడ్ లేకపోయినా వక్ఫ్ ఆస్తులుగానే ఉంటాయి. కీలక సవరణకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఆమోదం తెలిపింది.
కలెక్టర్‌దే తుది అధికారం కాదు !
వక్ఫ్ ఆస్తుల విషయంలో కలెక్టర్ దే తుది నిర్ణయం అని మొదటి బిల్లు ముసాయిదాలో ప్రతిపాదించారు. కానీ తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన సవరణల్లో కలెక్టర్ ది మాత్రమే నిర్ణయాధికారం కాదని.. అంతకు మించి న్యాయపరమైన అవకాశాలు వక్ఫె్ స్థలాలకు చెందిన వారికి ఉంటాయని స్పష్టం చేశారు.
ఇక డిజిటల్‌గా పత్రాలను సమర్పించడానికి 6 నెలల గడువు పొడిగింపు
అలాగే డిజిటల్ గా పత్రాలు సమర్పించే గడువును ప్రతిపాదిత ముసాయిదాలో చాలా తక్కువగా చెప్పారు. కానీ టీడీపీ కనీసం ఆరు నెలల పాటు సమయం ఇవ్వాలని ప్రతిపాదించింది. ప్రస్తుత పరిస్థితుల్లో డిజిటల్ డాక్యుమెంట్ల కోసం ఆ మాత్రం సమయం అవసరం పడుతుందని స్పష్టం చేసింది. టీడీపీ నాయకత్వం చేసిన ఈ సవరణకూ కేంద్రం అంగీకరించింది.
తెలుగుదేశం పార్టీ నాలుగో సవరణ కూడా ప్రతిపాదించింది. హిందూ దేవాలయాల విషయంలో వేరే మతస్థుల ప్రమేయాన్ని ఎలా అయితే ఒప్పుకోరో…
ముస్లింలు వాళ్ళ మత వ్యవహారాలలో ముస్లిమేతరుల ప్రమేయాన్ని ఒప్పుకోరని.. ఈ కోణంలో సవరణ చేయాలని డిమాండ్ చేస్తోంది. టీడీపీ మొదటి నుంచి దీని మీద గట్టిగా పోరాడుతుంది, ఈ విషయంలో ముస్లిం సమాజం కూడా గట్టిగా పోరాడాల్సి ఉందిని చెబుతోంది.
వక్ఫ్ బిల్లుపై వైసీపీ సైలెంట్
ముస్లింలలను ఓటు బ్యాంకుగా చూసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి ప్రయోజనాలను కాపాడే విషయంలో అసలు స్పందించడం లేదు. అసలు ఒక్క సవరణ కూడా ప్రతిపాదించలేదు. అలాగని వ్యతిరేకంగా ఓటు వేస్తామని కూడా చెప్పలేదు. బిల్లు పాస్ కావడం తధ్యమని తేలినప్పుడు ముస్లింలకు అభ్యంతరకంగా ఉన్న అంశాలను తప్పించే ప్రయత్నం చేయాలి. ఈ విషయంలో టీడీపీ మెరుగైన పాత్ర పోషించిందని.. ముస్లింల ప్రయోజనాలను కాపాడిందని జాతీయ మీడియా కూడా ప్రశంసిస్తోంది.