దశలవారీగా మద్య నిషేధం చేస్తామని చెప్పిన ఏపీ సర్కార్ ఇక మడమ తిప్పినట్లుగానే కనిపిస్తోంది. మద్యం అమ్మకాలను ప్రోత్సహించేలా రోజుకో నిర్ణయంతో ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఏటా ఇరవై శాతం మద్యం దుకాణాలను తగ్గించుకుంటూ పోతామని ఎన్నికల సభల్లో..మేనిఫెస్టోలో జగన్ హామీ ఇచ్చారు. తొలి ఏడాది ఇరవై శాతం.. రెండో ఏడాది మరో పది శాతం వరకూ దుకాణాలు తగ్గించారు. అయితే ఇప్పుడు మద్యం మాల్స్ పేరుతో వాటన్నింటినీ కవర్ చేస్తున్నారు. భారీ స్థాయిలో మద్యం మాల్స్ ఏర్పాటుకు అనుమతులు ఇస్తున్నారు. అంటే మద్యం దుకాణాలు పేరుకు బదులు మద్యం మాల్స్ ఏర్పాటుచేస్తున్నారన్నమాట. ఓ మాదిరి పట్టణాలన్నింటినీ వీటిని అందుబాటులోకి తెస్తున్నారు.
ప్రభుత్వ నిర్ణయాలపై టీడీపీ మండి పడింది. బొండా ఉమామహేశ్వరరావు మద్యం బాటిళ్లను మీడియా ముందు ప్రదర్శించి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రూ.20 విలువైన మద్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రూ. 200 అమ్మి దోచుకుంటున్నారని ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ మండిపడింది. దమ్ముంటే ఆ మద్యం తయారు చేసే కంపెనీలు, కొనుగోలు చేస్తున్న ఎక్సైజ్ శాఖ ఇన్వాయిస్లను బయట పెట్టాలని సవాల్ చేశారు. మద్యనిషేధం చేస్తామని హామీ ఇస్తే మహిళలు నమ్మి ఓట్లేశారని ఇప్పుడు మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారని.. మద్యపాన నిషేధంపై ప్రభుత్వ విధానం ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా మద్యం నిషేధం అన్న ఆలోచనే లేదని… ఆదాయం పెంచుకునేందుకు మాత్రం ధరలు భారీగా వడ్డించారన్న అభిప్రాయం వినిపించడం ప్రారంభమయింది. పెద్ద ఎత్తున ప్రజలనుంచి మద్యం ఆదాయాన్ని పిండుకునేందుకు ఇలా చేయడం ఏమిటన్న విస్మయం సామాన్యుల్లోనూ వ్యక్తమవుతోంది. ఇప్పుడు ఇలా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేసేసి.. ఎన్నికలకు ముందు స్టార్ హోటళ్లలో మాత్రమే మద్యం అమ్మకాలంటూ ఏదో ఓ స్కీమ్ పెడితే మొదటికే మోసం వస్తుందని వైసీపీ నేతలే కంగారు పడుతున్నారు. ఈ అంశంపై టీడీపీ ఇప్పటికే విమర్శలు ప్రారంభించడంతో ప్రభుత్వం ఎలా ఎదురుదాడి చేస్తుందా అన్న ఆసక్తి ఇతర పార్టీల్లోనూ ఏర్పడింది.