వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నిన్న అనంతపురంలో నిర్వహించిన రైతు భరోసా యాత్రలో ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ “మిమ్మల్ని మోసం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈసారి కనబడితే చెప్పులు తీసుకొని కొట్టండి,” అని అన్నారు. సహజంగానే తెదేపా నేతలు అందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర నీటి పారుదల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చాలా తీవ్రంగా స్పందించారు.
ఇవ్వాళ్ళ ఉదయం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ,“అసలు జగన్ భరోసా యాత్రలు దేనికోసం చేస్తున్నారు? ఆయన మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లున్నారు. అందుకే ఉచితానుచితాలు మరిచి ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ప్రజల మంచి చెడ్డలు చూసుకొనేందుకు ప్రభుత్వం ఉంది కనుక ప్రజల కోసం జగన్ భరోసా యాత్రలు నిర్వహించే బదులు ముందు మానసిక వైద్యుడికి చూపించుకొంటే మంచిది,” అని అన్నారు.
ఇంతవరకు జగన భరోసా యాత్రని పట్టించుకోని అనంతపురం జిల్లాలో తెదేపా కార్యకర్తలు కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలపడం మొదలుపెట్టారు. తెదేపా నేడు అనంతపురం జిల్లా వ్యాప్తంగా జగన్ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ర్యాలీలు నిర్వహిస్తోంది. జగన్ భరోసా యాత్ర చేస్తున్న నగురూరు, యాకిడి, వేములపాడులో ఆయనను అడ్డుకొనేందుకు బయలుదేరిన తెదేపా శ్రేణులను పోలీసులు మధ్యలోనే అరెస్ట్ చేసి స్టేషన్లకి తరలించారు. అయినప్పటికీ యాకిడిలో కొందరు తెదేపా కార్యకర్తలు “జగన్ గో బ్యాక్” అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ బైక్ ర్యాలి నిర్వహించడంతో, వైకాపా కార్యకర్తలు కూడా ఆందోళనకి సిద్దం అయ్యారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు అదుపులోనే ఉన్నప్పటికీ కొంచెం ఉద్రిక్తంగా ఉన్నాయి. ఎటువంటి అవాంచనీయమైన సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.