ప్రభుత్వానికి హెరిటేజ్ మజ్జిగ ప్యాకెట్ల విషయంపై సీబీఐ విచారణ కోరాలని ఏపీ కేబినెట్ నిర్ణయించడంపై టీడీపీ భిన్నంగా స్పందించింది. సీఎం జగన్ సొంత కంపెనీ సరస్వతి పవర్‌కు నీళ్లు… గనులు కేటాయించడంపై… సాక్షిపత్రికకు కోట్లకు కోట్లు యాడ్స్ ఇవ్వడంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాక్షి పత్రికకు ఎప్పుడూ లేనన్ని ప్రకటనలు వస్తున్నాయి. అత్యధిక సర్క్యూలేషన్ కలిగిన పత్రిక కాకపోయినా… ఈనాడుకు కన్నా ఎక్కువగా యాడ్స్ ఇస్తున్నారు. సమాచార పౌరసంబంధాల శాఖ మాత్రమే కాకుండా.. వివిధ మంత్రుల శాఖలు కూడా ఇస్తున్నాయి.
ప్రభుత్వానికి ఏడాది పూర్తయిన సందర్భంగా.. పదిహేను పేజీల ఫుల్ పేజీ యాడ్స్ సాక్షికి వచ్చాయి. అదే సమయంలో.. సాక్షి పత్రికకు సంబంధించిన అనేక మంది ఉద్యోగులు.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా ప్రభుత్వంలో చేరారు.చాలా మంది సలహాదారులుగా కూడా…చేరారు. వీటన్నింటినీ టీడీపీ హైలెట్ చేయాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఏడాది కాలంగా గత ప్రభుత్వ అవినీతిని వెలికి తీస్తామంటూ ప్రకటనలు చేసిన ప్రభుత్వం.. అనేక విచారణ కమిటీలు వేసింది. కానీ ఏమీ తేల్చలేకపోవడంతో టీడీపీ ఇప్పటికే విమర్శలు ప్రారంభించింది.
ఈ క్రమంలో చంద్రన్న కానుకలు… ఫైబర్ నెట్ అవినీతి పై సీబీఐ విచారణకు సిఫార్సు చేస్తూ కేబినెట్లో నిర్ణయించడం…టీడీపీని కూడా ఆశ్చర్య పరిచింది. అందుకే ఎదురుదాడి చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి కంపెనీలకునేరుగా లబ్ది కలిగించే నిర్ణయాలను ప్రభుత్వం తీసుకోవడాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.