పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ భూసేకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అధికార తెదేపా నేతలు, మంత్రులు పవన్ కళ్యాణ్ పై కొంచెం ఆచితూచి విమర్శలు చేస్తున్నారు. కానీ వైకపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని మాత్రం చాలా తీవ్రంగా విమర్శిస్తున్నారు. పవన్ కళ్యాణ్ న్ని విమర్శించిన వారిలో మంత్రి నారాయణ కూడా ఒకరు. ఆయన నిన్న గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకొని సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తామని చెపుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి నిన్న అదే సమస్యపై విజయవాడలో దీక్ష చేస్తున్నప్పుడు, తెదేపా నేతలు కూడా ఆయనకు పోటీగా దీక్ష చేసారు. ఎందుకంటే జగన్ రాజధాని నిర్మాణానికి ఆటంకాలు కల్పిస్తునందుకు నిరసనగానట! భగవంతుడు ఆయనకి మంచి బుద్ధి ప్రసాదించాలని వారు కోరారు. జగన్ అవినీతి గురించి ప్రస్తావించి, ఆయన జైలుకి పోవడం ఖాయమని జోస్యం చెప్పారు.
ఇదే విషయాన్ని వైకాపా నేత కొడాలి నాని ప్రశ్నిస్తూ “పవన్ కళ్యాణ్ భూసేకరణ చేయవద్దని చెపితే అందులో వారికి తప్పేమీ కనబడలేదు. కానీ మేము చెపితే తప్పా? పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంతంలో పర్యటించి భూసేకరణను అడ్డుకొంటానని చెపితే, వారికి ఆయన పోరాటంలో న్యాయం కనబడుతోంది. కానీ అదే పోరాటం మేము చేస్తే రాజకీయం చేస్తున్నామని ఎందుకు ఆరోపిస్తున్నారు? ఒకే సమస్యపై పవన్ కళ్యాణ్ తో వారు ఒకలాగా వ్యవహరిస్తారు, స్పందిస్తారు. మాతో మరొకలాగ స్పందిస్తున్నారు. మాకు మంచి బుద్ధి ప్రసాదించమని వారు భగవంతుడుని ప్రార్దిస్తున్నారుట. కానీ రైతుల గోడు పట్టించుకోకుండా బలవంతంగా వారి భూములను లాక్కోవాలని చూస్తున్న వారికే భగవంతుడు మంచి బుద్ధి ప్రసాదించాలని వారు ప్రార్ధించాలి ముందు,” అని ఘాటుగా విమర్శించారు.