ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని ఎప్పుడో కేంద్రం తేల్చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా హోదా వాదనకు ఫుల్ స్టాప్ పెట్టేసి చాన్నాళ్లయింది. హోదా ఎందుకు రాలేదో, కేంద్రం ఎందుకు ఇవ్వలేదో అనే ప్రశ్నలకు రకరకాల కారణాలు చెప్పారు. అంతేకాదు, హోదాకు మించిన ప్యాకేజీని సాధించామని టీడీపీ డప్పు కొట్టుకుంది. అయితే, ఆ ప్యాకేజీలో విభజన చట్టంలో ఉన్నవే ఉన్నాయి తప్ప, అంతకుమించి అదనంగా ఆంధ్రా పొందిన ప్రయోజనాలేవీ లేవనే సంగతి అందరికీ తెలిసిందే. ఏదేమైనా.. ప్రత్యేక హోదా అనే చాప్టర్ ని టీడీపీ మూసేసింది కదా. అలాంటప్పుడు, దాని గురించి ఎవరేమన్నా స్పందించకూడదు. కానీ, రాహుల్ పర్యటన సందర్భంగా టీడీపీలో ఈ అంశం మరోసారి చర్చకు కారణమైంది.
ఆంధ్రప్రదేశ్ ను విడదీసిన పాపమంతా కాంగ్రెస్ పార్టీదే అని చంద్రబాబు విమర్శిస్తుంటారు. ఆ ఫలితంగానే ఒక్కటంటే ఒక్క సీటు కూడా గత ఎన్నికల్లో కాంగ్రెస్ దక్కించుకోలేకపోయింది. అలాంటి పార్టీ ప్రత్యేక హోదాపై ఒక మీటింగ్ పెట్టుకుంటే టీడీపీ నేతలు కాస్త అతిగానే స్పందించేశారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అయినప్పుడు కాంగ్రెస్ ఏ సభ పెట్టుకుంటే ఏంటనేట్టుగానే ఉండాలి కదా! కానీ, రాహుల్ గాంధీ సభకు వెళ్లొద్దంటూ ప్రజలకు చంద్రబాబు పిలుపు నివ్వడం విశేషం. అలాంటి సభలకు వెళ్తే ఆంధ్రాకి ద్రోహం చేసినట్టే అవుతుందంటూ వ్యాఖ్యానించారు. అయినా, రాహుల్ ని చూద్దామని అనుకున్నవారు వెళ్లారు, అది వేరే విషయం. అంతేకాదు, రాహుల్ పర్యటనకు వ్యతిరేకంగా కొన్ని నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టారు. రాహుల్ గో బ్యాక్ అంటూ ధర్నాలు కూడా చేశారు! గుంటూరు సభలో రాహుల్ చేసి వ్యాఖ్యలను టీడీపీ తీవ్రంగానే పరిగణిస్తోంది.
ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ మాట్లాడుతుంటే టీడీపీకి ఎందుకంత ఉలికిపాటు..? రాష్ట్రాన్ని విభజించిన పాపమంతా కాంగ్రెస్ పార్టీదే అయినప్పుడు, ఆ తప్పును దిద్దుకునేందుకు ప్రత్యేక హోదా ఇస్తామని అంటే మంచిదే కదా. అయినా, కాంగ్రెస్ ను ప్రజలను ఎన్నటికీ నమ్మరనే నమ్మకం చంద్రబాబుకు దండిగా ఉన్నప్పుడు… ఈ నిరసన కార్యక్రమాలు ఎందుకు..? ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అనుకున్నప్పుడు దాని గురించి రాహుల్ మాట్లాడినా, మరొకరు స్పందించినా ఇంతగా ఉక్కిరిబిక్కిరి అవాల్సిన అవసరం ఏముంది..? మొత్తానికి, ప్రత్యేక హోదా పేరేత్తితే టీడీపీలో కలవరపాటు కనిపిస్తోంది.