తొమ్మిది సూత్రాలనే ప్రధానాంశాలు పెట్టుకుని 2019 ఎన్నికలకు ప్రతిపక్ష నేత జగన్ సిద్ధమైపోతున్నారు. గుంటూరులో నిర్వహించిన ప్లీనరీ కార్యక్రమంతో వైకాపా శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. ఏదేమైనా, దాదాపు రెండేళ్ల ముందే వైకాపాలో ఎన్నికల హీట్ మొదలైపోయిందన్నది జగన్ మాటల్లో స్పష్టంగా ఉంది. ఎన్నికల మ్యానిఫెస్టో ఇప్పుడే ప్రకటించినట్టుగా ఉంది! వైకాపా ప్లీనరీలో జగన్ ప్రసంగంపై అధికార పార్టీ నేతలు ఘాటు విమర్శలకు దిగారు. జగన్ ప్రకటించిన తొమ్మిది సూత్రాలు అవగాహన రాహిత్యంతో ఇచ్చిన హామీలుగా కనిపిస్తున్నాయంటూ తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు విమర్శించారు. ప్టీనరీ అనే ఒక కార్యక్రమం పెట్టుకున్నారు కాబట్టి, ఏదో ఒకటి ప్రకటించాలనే హడావుడితో మాట్లాడినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. 2004లో వైయస్ కూడా దశల వారీగా మద్యాన్ని ఎత్తేస్తామని పాదయాత్రలో చెప్పారనీ, అయితే.. దాన్ని పదివేల కోట్ల నుంచి రూ. 30 వేల కోట్లకు తీసుకెళ్లిన పరిస్థితి చూశామన్నారు. ఎంతో గొప్పగా మొదలుపెట్టిన ఫీజు రీఎంబర్స్ మెంటు విషయంలో కూడా కాంగ్రెస్ అధికారం నుంచి కోల్పోయేసరికి భారీ ఎత్తున బకాయిలు వదిలేసి వెళ్లారన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతి గురించి ప్లీనరీలో భారీ ఎత్తున విమర్శలు చేశారు జగన్. చంద్రబాబు లాంటి అవినీతిపరుడు దేశ చరిత్రలోనే లేరని ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ విషయం తీసుకున్నా అవినీతి రాజ్యమేలుతోందని విమర్శించారు. రాజధాని ప్రాంతం, విశాఖల్లో భారీ ఎత్తున భూ కుంభకోణాలకు పాల్పడ్డారన్నారు. అయితే, ఈ కామెంట్స్ పై మంత్రి కాల్వ శ్రీనివాసులు స్పందించారు. ఎలాగోలా అధికారంలోకి వచ్చేయాన్న ఉద్దేశమే జగన్ ప్రసంగంలో కనిపిస్తోందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి ప్రత్యేకంగా ప్రజలకు పరిచయం చేయాల్సిన పనిలేదనీ, తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేసిన అవినీతి బహుశా భారతదేశంలో ఏ నాయకుడూ చేసి ఉండరని ఆరోపించారు. ఇలాంటి చరిత్రను వెనకపెట్టుకుని ఆయన అవినీతి గురించి మాట్లాడుతూ ఉండటం.. దెయ్యాలు వేదాలు వల్లించడం మాదిరిగా ఉందన్నారు.
ప్లీనరీలో జగన్ మాట్లాడుతూ.. సినిమాల్లో హీరోలు చివరి వరకూ కష్టాలు పడుతూ ఉండటాన్ని చూస్తుంటామనీ, చివరి రీల్లో విలన్ ను హీరో చావబాదే సన్నివేశం ఉంటుందన్నారు. అంతిమంగా గెలిచేది న్యాయం, ధర్మం అని చెప్పారు. న్యాయం, ధర్మంతో ఉన్నవారికి ప్రజల అండ ఉంటుందనీ, భగవంతుడి అనుగ్రహం కూడా ఉంటుందని జగన్ చెప్పారు. దీనిపై టీడీపీ కౌంటర్ వేసింది. మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు స్పందించారు. ఆంధ్రాలో ఇప్పటికే తాము హీరో పాత్రలో తాము ఉన్నామనీ, దమ్మున్న నాయకుడిగా హీరోగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని ఉమా అన్నారు. అవినీతి బురదలో కూరుకుపోయి, జైలుకు వెళ్తున్నవారు తమరే అంటూ జగన్ ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ‘ఇప్పటికే ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టారనీ, రేపు డిపాజిట్లు కూడా కోల్పోతారు, మీకు ఎన్నటికీ హీరో కాలేరు’ అని మంత్రి విమర్శించారు. మొత్తానికి, ప్లీనరీలో జగన్ చేసిన విమర్శలపై టీడీపీ కూడా వెంటనే
కౌంటర్లు ఇచ్చేసింది.