ఆంధ్రప్రదేశ్‌లో బద్వేలు అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరగాలన్న విషయం చాలా మందికి గుర్తు లేదు. అక్కడి వైసీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మార్చి 26వ తేదీన కన్ను మూశారు. అయితే ఆ స్థానం వైసీపీ కంచుకోట కావడంతో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన, బీజేపీ కానీ పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. అందుకే కనీస కసరత్తు లాంటివి కూడా చేసినట్లుగా లేదు. కానీ హఠాత్తుగా టీడీపీ అధినేత చంద్రబాబు గత ఎన్నికల్లో పోటీచేసిన ాజశేఖర్ అనే అభ్యర్థినే టీడీపీ తరపున నిలబెడుతున్నట్లుగా ప్రకటించారు. బద్వేలు టీడీపీ వ్వహారాలన్నీ విజయమ్మ చూస్తూంటారు. ఇటీవల ఆమె అంత యాక్టివ్‌గా లేరు. అయినప్పటికీ ఆమెకు ఫోన్ చేసి చంద్రబాబు విషయం చెప్పి అభ్యర్థిని ఖరారు చేశారు.
వైసీపీ తరపున ఇంకా అభ్యర్థి ఖరారు కాలేదు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి వెంకటసుబ్బయ్య దాదాపు 44 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. వైసీపీ తరుపున వెంకటసుబ్బయ్య భార్య డాక్టర్ సుధకే టిక్కెట్ ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫైనల్ చేసే అవకాశం ఉంది. అయితే ఉపఎన్నికలు కాబట్టి అక్కడ అభివృద్ధి పనులకు సీఎం జగన్ నిధులు మంజూరు చేస్తున్నారు. పలు అభివృద్ధిపనులకు గతంలోనే శంకుస్తాపన చేశారు. తాజాగా బద్వేలును రెవిన్యూ డివిజన్‌గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం వచ్చినా తమ ప్రాంతానికి ఏమీ జరగలేదన్న అభిప్రాయం అక్కడి ప్రజల్లో ఏర్పడకుండా సీఎం జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఇలాంటివేమీ ప్రకటించకపోయినా అక్కడ వైసీపీకే భారీ మెజార్టీ వస్తుందన్న అంచనాలున్నాయి.
నిబంధనల ప్రకారం ఎవరైనా ఎమ్మెల్యే లేదా ఎంపీ చనిపోతే ఆరు నెలల్లో ఎ్నికలు పెట్టాల్సిఉంది. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్నందువల్ల దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జరగాల్సిన ఉపఎన్నికలను వాయిదా వేస్తున్నామని కేంద్ర ఎన్నికల సంఘం కొన్నాళ్ల కిందట ప్రకటించింది. ఇటీవలే ఉపఎన్నికలపై పార్టీల అభిప్రాయాలను తెలుసుకున్నాదు. ఉపఎన్నిక నిర్వహించడానికి ఎన్నికల సంఘం నిర్ణయిస్తే.. బద్వేల్లో కూడా ఉపఎన్నిక జరగుతుంది. లేకపోతే.. మరికొంతకాలం ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి.