కాపులకు అయిదు శాతం నిర్ణయంపై ఆశించినంత అనుకూల స్పందన రాకపోవడం ముఖ్యమంత్రి చంద్రబాబుకూ ఆ పార్టీ నాయకులకు ఆగ్రహం తెప్పిస్తున్నది. అందుకే ఆదివారం విడియో కాన్ఫరెన్సులో చంద్రబాబు ప్రతిపక్షాలపై విరుచుకుపడ్టారట. కాపులకు మేలు చేయాలనుకుంటే కులాల మధ్య తగవులు పెడుతున్నారని ఆరోపించారు. ఈ సమయంలో వాస్తవాలు చెప్పి సర్దుబాటు చేసేందుకు ముగ్గురు నేతలతో ఒక క మిటీనీ వేశారు. మరోవైపున తెలంగాణలో కెసిఆర్‌కు చేస్తున్నట్టుగా ఎపిలోనూ చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకాలు ప్రారంభించారు. ప్రధాన కాపు నేతలు పెద్దగా హర్షం వెలిబుచ్చకపోగా బిసి నేతలు, తెలంగాణలో తమ పార్టీ గత ముఖ్యమంత్రి అభ్యర్థి ఆర్.కృష్ణయ్య అందరికంటే ఎక్కువ వ్యతిరేకత తెల్పడం టిడిపికి మింగుడు పడటం లేదు. అయితే బిసి వర్సెస్ కాపు అన్నట్టుగా ఈ సమస్యను తీసుకురావాలనే వ్యూహంవారికి లేదని కాదు. వైసీపీ ఎంఎల్‌సి పిల్లి సుబాష్ చంద్రబోస్ కూడా వ్యతిరేకించడంతో ఈ రెండు పార్టీలుఒకరినొకరు అనుకోలేని స్థితి ఏర్పడింది. మరో వైపున కృష్ణయ్య తాను అవసరమైతే రాజీనామా చేస్తానని కూడా ప్రకటించారు.ఎపిలో బిసిలకు ఆయనలా గుర్తింపు పొందిన నాయకుడు లేకపోవడం పెద్దలోపమని బిసినేతలంటున్నారు. ఏది ఏమైనా రానున్న రోజుల్లో ఇదో రాజకీయ దుమారంగా మారడం తథ్యం.