ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ తేల్చి చెప్పిన తరువాత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా తెదేపా ఎంపిలు, ఎమ్మెల్యేలు అందరూ ఈసారి చాల గట్టిగానే మాట్లాడుతున్నారు. దీని గురించి ఎవరెవరు ఏమన్నారంటే:
ఎంపి మురళీమోహన్: ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఆవిధంగా మాట్లాడటం చాలా బాధ కలిగించింది. ప్రత్యేక హోదా అంశాన్ని 14వ ఆర్ధిక సంఘానికి ముడిపెట్టడం సబబు కాదు. మాకు ఎంపి, కేంద్రమంత్రి పదవులు ముఖ్యం కాదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వాటిని వదులుకోవడానికి సిద్దంగా ఉన్నాము. రేపు ముఖ్యమంత్రితో చర్చించిన తరువాత దీనిపై తుది నిర్ణయం తీసుకొంటాము.
ఎంపి కొనకళ్ళ సత్యనారాయణ: ప్రత్యేక హోదా, రాజధాని, పోలవరం నిర్మాణం కోసమే మేము భాజపాతో పొత్తులు పెట్టుకొన్నాము. అవి రానప్పుడు భాజపాతో స్నేహం కూడా అవసరం లేదు. ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని దేశంలో వివిధ రాష్ట్రాలకి చెందిన వివిధ పార్టీల ఎంపిలు కోరుతున్నారు. దానిపై ఓటింగ్ నిర్వహిస్తే తాడోపేడో తేలిపోతుంది కదా?
ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు: మిత్రధర్మం పాటించి ఇంతవరకు చాలా సహనంతో ఎదురుచూశాము కానీ కేంద్రం మా సహనాన్ని అలుసుగా భావిస్తున్నట్లుంది. కనీసం ఇప్పటికీ సమయం మించిపోలేదు. ఏపికి ఇచ్చిన హామీలన్నీ అమలుచేసి రాష్ట్రాన్ని, మన స్నేహాన్ని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
ఎంపి టిజి వెంకటేష్: ప్రత్యేక హోదా విషయంలో ఏపిని కేంద్రప్రభుత్వం మోసం చేస్తే, రాష్ట్రంలో భాజపాకి కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే పడుతుంది. ఏ ఆర్ధిక సంఘం అనుమతి తీసుకొని ప్రధాని నరేంద్ర మోడీ బిహార్ కి 1.25లక్షల కోట్లు ప్యాకేజి ఇచ్చారు? ఏపికి కూడా అలాగే ఇవ్వాలి. తెదేపాకి చిత్తశుద్ధి లేదని విమర్శిస్తున్న జగన్మోహన్ రెడ్డికి నిజంగా ప్రత్యేక హోదా సాధించాలనే చిత్తశుద్ధి ఉంటే, రాష్ట్రంలో కాదు డిల్లీ వెళ్లి అక్కడ దీక్ష చేసి ప్రధాని నరేంద్ర మోడీని నిలదీయాలి.
ఎంపి కేశినేని నాని: రాష్ట్ర ప్రయోజనాల కంటే రెండు కేంద్రమంత్రి పదవులు మాకు ముఖ్యం కాదు. అవసరమనుకొంటే వెంటనే రాజీనామా చేసేస్తాము. కేంద్రప్రభుత్వం చివరికి ఈవిధంగా చేస్తుందనుకోలేదు. మేము చాలా నిరాశ చెందాము.
క్రితంసారితో పోలిస్తే తెదేపా నేతలు అందరూ భాజపాతో తెగతెంపులు చేసుకోవడం గురించే గట్టిగా మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుమతి లేకుండా వారు ఆవిధంగా మాట్లాడలేరు కనుక వారు చెపుతున్నవన్నీ ముఖ్యమంత్రి అభిప్రాయలుగానే భావించవచ్చు. ఇప్పటికిప్పుడు భాజపాతో తెదేపా తెగతెంపులు చేసుకోకపోయినా, అందుకు వెనుకాడబోమని వారు చాలా స్పష్టంగానే చెపుతున్నారు. కనుక తెదేపాతో తెగతెంపులు చేసుకొని వేరే పార్టీతో పొత్తులు పెట్టుకోవడం మంచిదో, లేకపోతే ఏపికి భారీ ఆర్ధిక ప్యాకేజిని ప్రకటించి తెదేపాని మంచి చేసుకొని దానితో కలిసి సాగడం మంచిదో భాజపా నిర్ణయించుకోవాలి. బంతి ఇప్పుడు దాని కోర్టులోనే ఉంది.