బిజెపితో వున్న బంధం నుంచి వెనక్కి వెళ్ళాలని అనుకోకపోయినా ముందుకి వెళ్ళవలసిన అవసరం లేదని తెలుగుదేశం నిర్ణయించుకుంది. కేంద్రంలో మరో సహాయమంత్రి పదవి స్వీకరించాలని ఢిల్లీనుంచి బిజెపి ప్రతినిధి ఒకరు సోమవారం మధ్యాహ్నం తెలుగుదేశం అధ్యక్షుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కోరగా ఆలోచించి రేపు చెబుతాను అని సమాధానం ఇచ్చారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాల ద్వారా తెలిసింది. శివసేన అధినేతకు కూడా అంతకు ముందే ఫోన్ లో బిజెపి ఇదే ఆఫర్ ఇచ్చింది.
కేంద్రంలో మరో పదవి వద్దని బాబు అప్పటికే నిర్ణయించుకున్నారు. వెంటనే సమాధానం చెప్పడం చిన్నపాటి కవ్వింపు కాగల అవకాశం ఉండటంతో టైము అడిగారు. బుధవారం ఫోన్ చేసి ”నో ధాంక్స్” చెప్పేశారు.
ప్రత్యేక హోదా లేదు, పోలవరానికి నిధులు లేవు. కేంద్రం సహాయనిరాకరణవల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో బిజెపిమీద వ్యతిరేకత పెరుగుతోంది. అంతకు మించి ఎటూ తేల్చుకోలేని బిజెపి ధోరణే తెలుగుదేశం పార్టీని రాజకీయంగా ఇబ్బంది పెడుతోంది.
బిజెపి ఆంధ్రప్రదేశ్ లో ప్రధానపార్టీ అయ్యే అవకాశం ఇప్పట్లోలేదు. తెలంగాణాలో కాంగ్రెస్ ను నెట్టేసి ఆస్ధానంలోకి రావడానికి అవకాశమైతే వుంది. ”నోరున్న” కెసిఆర్ ఇది జరగ నివ్వరు. టిఆర్ఎస్ కి ఎదో ఒక సమస్య మొదలైనపుడల్లా బిజెపి తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై తెలంగాణాకు అన్యాయం చేస్తున్నాయని రాగం మొదలుపెడతారు. అందులో తెలంగాణా సెంటిమెంటు వుంది కాబట్టి అక్కడి ప్రజలకు ఆ రాగం నచ్చుతుంది. ఆ సెంటిమెంటు కి వ్యతిరేకంగా బిజెపి వెళ్ళదు. ఇందువల్ల తెలంగాణాకి, ఆంధ్రప్రదేశ్ కి పేచీ వచ్చిన ప్రతీసారీ ఆనష్టాన్ని తెలుగుదేశం మీదికి నెట్టేసి బిజెపి తెరవెనక్కి వెళ్ళిపోతోంది.
తెలుగురాష్ట్రల మధ్య వివాదాల్లో తన పోకడలు వైఖరులవల్ల లాభనష్టాలను బేరీజువేసుకోవడంలో బిజెపి తటపటాయింపే తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగా మారింది. మరో మంత్రి పదవిని చంద్రబాబు నిరాకరించడానికి ఇదే ప్రధాన కారణం…అయితే, ఇది ”ఇక ఆపేద్దాం” అన్న తెగతెంపులు కావు…”ఇక్కడికి ఆపుదాం” అన్న నిష్టూరం మాత్రమే!!