తెదేపా-భాజపా కూటమి ఏపిలో అధికారంలోకి వచ్చిన కొత్తలో ఆ రెండు పార్టీలో నేతలు ఒకరి మెప్పు మరొకరు పొందడానికి రకరకాల నిర్ణయాలు, ప్రకటనలు చేస్తుండేవారు. అటువంటిదే భాజపా నేత నిర్మలా సీతారామన్ కి తెదేపా రాజ్యసభ సీటు కేటాయించడం…ఆమె భర్త పరకాల ప్రభాకర్ ని క్యాబినెట్ హోదాగల ప్రభుత్వ మీడియా సలహాదారుగా చంద్రబాబు నాయుడు నియమించుకోవడం…కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి వరాల జల్లు కురిపించడం.
ఇప్పుడు అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొంది. కనుక నిర్ణయాలు కూడా భిన్నంగానే ఉంటున్నాయి. ఇదివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి నీడలా తిరుగుతూ కనిపించే పరకాల ప్రభాకర్ చాలా రోజులుగా కనిపించడం లేదు. ప్రత్యేక హోదా, ఆర్ధిక ప్యాకేజి తదితర హామీలపై కేంద్రం మాటమార్చిన తరువాత నుంచే ఆయన కనిపించడం లేదు. ఈసారి ఆయన భార్య, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కి తెదేపా రాజ్యసభ సీటు కేటాయించడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే స్వయంగా నిన్న డిల్లీలో స్పష్టం చేసారు.
మొదట్లో అడగకుండానే రాష్ట్రానికి వరాలు కురిపించిన ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎంతగా బ్రతిమాలుకొన్నా పైసా కూడా విదిలించడం లేదు. ఆ విషయం నిన్న మరొక్కమారు స్పష్టం అయ్యింది. భాజపా నేతలు రాష్ట్రానికి రూ.1.42 లక్షల కోట్లు ఇచ్చామని చెపుతుంటే, హూద్ హూద్ తుఫాను సహాయంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన వెయ్యి కోట్లలో సగం కూడా నేటి వరకు ఇవ్వలేదని తెదేపా నేతలు వారికి గుర్తు చేస్తుంటారు.
తెదేపా-భాజపాలు రెండూ కలిసి రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధి చేస్తాయని రాష్ట్ర ప్రజలు వాటిని అధికారం కట్టబెడితే, ఆ పార్టీల నేతలు ఒకరిని మరొకరు నిందించుకొంటూ కాలక్షేపం చేస్తుండటం దురదృష్టకరం. వెంకయ్య నాయుడికో, నిర్మలా సీతారామన్ కో తెదేపా రాజ్యసభ సీటు ఇస్తుందా, ఇవ్వదా అనేది ఆ రెండు పార్టీలకి సంబంధించిన వ్యవహారమే తప్ప దానితో రాష్ట్ర ప్రజలకు సంబందం లేదు. ఆ విధంగా కేంద్రానికి తెదేపా తన నిరసన తెలిపినట్లే అవుతుంది తప్ప ఆమెకు సీటు ఇవ్వకుండా నిరాకరించినంత మాత్రాన్న రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టవచ్చనుకొంటే పొరపాటే. ఎందుకంటే నేటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో తెదేపా-భాజపాలు భాగస్వాములుగానే కొనసాగున్నాయి. రాష్ట్ర స్థాయిలో ఇరు పార్టీల నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకొంటున్నా జాతీయ స్థాయిలో ఇంకా సఖ్యతగానే ఉన్నాయి. రాష్ట్ర ప్రజలు ఇవేవీ గమనించలేరనుకొంటున్నట్లుగా రెండు పార్టీల నేతలు వ్యవహరిస్తున్నారు. ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే చివరికి వారే నష్టపోయే ప్రమాదం ఉందని గ్రహిస్తే మంచిది.