తెదేపా అధికారిక వెబ్ సైటుని ఆపార్టీ నేతలు, మంత్రులు, కార్యకర్తలు చూస్తున్నారో లేదో గానీ వైకాపా మాత్రం ఎప్పుడూ మిస్ కాకుండా చాలా జాగ్రత్తగా ఫాలో అవుతూ అందులో పేర్కొన్న ప్రతీ అంశాన్ని జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకొంటున్నట్లు స్పష్టమయింది.
చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ ఏజన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలను తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని తెలియజేస్తూ అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక బహిరంగ లేఖ వ్రాసారు. దానిని తెదేపా అధికారిక వెబ్ సైటులో పెట్టారు. అది నిన్నటి వరకు అందులోనే ఉంది. కానీ మొన్న రాష్ర్ట ప్రభుత్వం విశాఖ ఏజన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తూ జి.ఒ.నెంబర్:97ను జారీ చేసిన మరునాడే అంటే శుక్రవారం ఆ లేఖను వెబ్ సైట్ నుండి తొలగించారని వైకాపా బయటపెట్టింది.
ఆ జి.ఒ.ప్రకారం విశాఖ ఏజన్సీ ప్రాంతంలో 3030 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 223 మిలియన్ టన్నుల బాక్సైట్ నిక్షేపాల తవ్వకాలకు ప్రభుత్వం అనుమతించింది. ఇంతకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు, అధికారంలోకి రాగానే ఎందుకు అనుమతిస్తున్నారు? అని వైకాపా నేతలు ప్రశ్నిస్తున్నారు. వారి ప్రశ్నకు చంద్రబాబు నాయుడు ఏమి జవాబు చెపుతారో?