నెల్లూరులో “కాకాణి ఫైల్స్” చోరీ వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. జిల్లా జడ్జి మొత్తం చోరీ పై అనుమానాలు వ్యక్తం చేస్తూ నివేదిక ఇచ్చారు. పోలీసులు ఉద్దేశపూర్వకంగా దర్యాప్తును సరిగ్గా చేయలేదని తేల్చారు. దీంతో ఈ కేసు అంశాన్ని సీబీఐకి ఎందుకివ్వకూడదని హైకోర్టు వాదనలు వింటోంది. ఏపీ ప్రభుత్వం మొదట కోర్టులో చోరీ అంశాన్ని సీబీఐతో విచారణ జరిపిస్తే ఇబ్బంది లేదని చెప్పింది. ఇప్పుడు కాకాణిపైఉన్న నకలీ డాక్యుమెంట్ల కేసును కూడా సీబీఐకి ఇచ్చినా అభ్యంతరం లేదని హైకోర్టుకు తెలిపారు.
ప్రభుత్వం ఇంత వేగంగా నిర్ణయం తీసుకోవడాన్ని టీడీపీ ప్రశ్నిస్తోంది. గతంలో వివేకా కేసు సీబీఐకి ఇవ్వవొద్దని అదే పనిగా వాదించారని కానీ సీబీఐకి ఇచ్చిన తర్వాత విచారణను ఎక్కడిక్కడ అడ్డుకున్నారని .. ఆ విధంగానే కాకాణి కేసును కూడా అడ్డుకుందామని ప్రయత్నిస్తున్నారా.. .. అదే ప్లాన్‌తో సీబీఐకి ఇవ్వమని అడుగుతున్నారని అని టీడీపీ ప్రశ్నిస్తోంది. దీనిని కూడా వివేకా హత్య కేసులానే సాగ తీయొచ్చనా? అని నిలదీశారు. లేదంటే అసలు దోషులే దొరక్కుండా చేయొచ్చనా? అని వైసీపీని టీడీపీ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు.
నిజానికి కాకాణి నకిలీ డాక్యుమెంట్ల కేసు అయినా.. కోర్టులో చోరీ కేసు అయినా ఏపీ పోలీసులు విచారణ జరిపితే ఏమవుతుందో టీడీపీ నేతలకు బాగా తెలుసు. అందుకే సీబీఐకి ఇవ్వాలని వారు కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా సీబీఐకి ఇస్తే అభ్యంతరం లేదని చెప్పడంతో రివర్స్ విమర్శలు చేస్తున్నారు. లేటు చేయడానికి సాక్ష్యాలు తారుమారు చేయడానికి ఇలా చేస్తున్నారంటున్నారు. మొత్తంగా చూస్తే.. ఏ దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేసినా.. రెండు పార్టీల్లో ఎవరో ఒకరు అనుమానించడం రివాజుగా మారిపోయింది.