హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి తాను హాజరు కాబోనని, తనకు ఆహ్వానంకూడా పంపొద్దంటూ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన వద్దన్నా లేఖ పంపుతామని ఏపీ ఆర్థిక శాఖమంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. ఆహ్వానం పంపితే వద్దనేవారు ప్రపంచంలో ఎవరూ ఉండబోరన్నారు. కార్యక్రమానికి వందలకోట్లు ఖర్చు చేస్తున్నామని ఆరోపించటం అవగాహనా రాహిత్యమని వ్యాఖ్యానించారు. ఏర్పాట్లను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వలేదని, జిల్లా కలెక్టర్లు చూస్తున్నారని తెలిపారు.
ఒక వ్యక్తికి 21 ఎకరాలలో 60 గదుల ప్యాలెస్ ఉండొచ్చుగానీ ఏపీ ప్రజల రాజధానికి 33 వేల ఎకరాలు ఉంటే తప్పేమిటంటూ పరోక్షంగా జగన్‌ను ఎద్దేవా చేశారు. జగన్ స్వగ్రామం పులివెందులకు నాలుగు లైన్ల రోడ్ ఎందుకని అడిగారు. ప్రధానమంత్రి హాజరవుతున్న కార్యక్రమంకాబట్టి ఆ స్థాయిలోనే చేయాల్సి ఉంటుందని అన్నారు. కార్యక్రమాన్ని సింపుల్‌గానే చేస్తూ ఘనంగా కనిపించేటట్లు చూస్తున్నామని చెప్పారు. ప్రతిపక్షాల విమర్శలు ఈర్ష్యతో చేస్తున్నవిగా కనబడుతున్నాయని అన్నారు.