విభజన చట్టంలో ప్రత్యేక హోదాపై హామీని చేర్చడానికి కాంగ్రెస్ ఎంపి కెవిపి రామచంద్ర రావు రాజ్యసభలో ప్రవేశ పెట్టిన ప్రైవేట్ బిల్లుపై రేపు ఓటింగ్ జరుగవలసి ఉంది. రాజ్యసభలో మోడీ ప్రభుత్వానికి బలం లేదు కనుక ఓటింగు జరిగితే ఆ బిల్లు తప్పకుండా ఆమోదం పొందడం ఖాయం. అదే జరిగితే మోడీ ప్రభుత్వానికి దాని వలన చాలా ఇబ్బందికరమయిన పరిస్థితులు ఎదుర్కోక తప్పదు. అందుకే పార్లమెంటు ఉభయ సభలను రెండు రోజులు ముందే నిరవధిక వాయిదా వెయ్యడానికి సిద్దమయింది. ఈ ఉపాయంతో ఈ గడ్డు సమస్య నుంచి మోడీ ప్రభుత్వం తప్పించుకోగలిగింది కానీ ప్రత్యేక హోదా విషయంలో దానికి చిత్తశుద్ధి లేదనే విషయం మరోమారు బయటపెట్టుకొని మళ్ళీ విమర్శలు మూట గట్టుకొంటోంది.
మోడీ ప్రభుత్వం తీసుకొన్న ఈ నిర్ణయంతో తెదేపా కూడా తప్పించుకోగలిగింది. ఈ బిల్లుకి తెదేపా మద్దతు ఇవ్వాలని కోరుతూ కెవిపి రామచంద్ర రావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక లేఖ వ్రాశారు. ఒకవేళ ఈ బిల్లుపై రేపు రాజ్యసభలో ఓటింగ్ జరిగి ఉండి ఉంటే, తెదేపా దానికి మద్దతు ఇవ్వలేదు. అలాగని ఇవ్వకుండా ఉండలేదు కూడా.
ప్రత్యేక హోదా విషయంలో మోడీ ప్రభుత్వం చాలా ఇబ్బందిపడుతోందని తెలిసి కూడా దానికి మద్దతు ఇస్తే మోడీకి ఆగ్రహం కలుగుతుంది. అంతే కాదు భాజపాతో తెగతెంపులకి తెదేపా సిద్దం అని ప్రకటించినట్లే అవుతుంది. అలాగని బిల్లుకి మద్దతు ఈయకపోతే రాష్ట్రంలో ప్రజలు, ప్రతిపక్షాలకు సంజాయిషీలు చెప్పుకోవడం చాలా కష్టం. ముఖ్యంగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసే విమర్శలను తట్టుకోవడం ఇంకా కష్టం. ఈ విషయంలో మోడీ ప్రభుత్వానికే కాదు చంద్రబాబు నాయుడుకి కూడా ఏమాత్రం ఆసక్తి లేదని జగన్ చేస్తున్న వాదనలకి బలం చేకూర్చినట్లవుతుంది. దాని వలన రాష్ట్రంలో తెదేపా పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంటుంది. కానీ మోడీ ప్రభుత్వ పుణ్యమాని తెదేపా కూడా ఈ సమస్య నుంచి తప్పించుకోగలిగింది. అంతే కాదు ఒకవేళ అది భాజపాతో తెగతెంపులు చేసుకోదలిస్తే, “రాజ్యసభలో బిల్లుపై ఓటింగ్ జరపకుండా ఎందుకు వాయిదా వేశారు? మీకు చిత్తశుద్ధి లేదు కనుకనే ఆ విధంగా చేసారు. అని నిలదీయవచ్చు. ఆ బిల్లుపై ఓటింగ్ జరిపి ఉంటే మేము కూడా డానికి అనుకూలంగా ఓటు వేద్దామనుకొన్నామని గొప్పలు చెప్పుకోవచ్చు. తెదేపాకు ఆ అవకాశం మోడీ ప్రభుత్వమే కల్పించింది. పనిలో పనిగా వైకాపాని కూడా ‘దీనిపై మీ వైఖరి ఏమిటి?’ అని తెదేపా ఎదురు ప్రశ్నించే అవకాశం కూడా కల్పించింది.