ప్రతిపక్ష పార్టీలు నిన్న నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ బంద్ విఫలం అయ్యిందని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. దానితో జగన్మోహన్ రెడ్డికి ప్రజల మద్దతు లేదనే విషయం స్పష్టం అయిపోయిందని అన్నారు. పిల్ల కాంగ్రెస్ బంద్ కి పిలుపునిస్తే మరో ఆలోచన లేకుండా తల్లి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందని అన్నారు. దానితో ఆ రెండు పార్టీల మద్య రహస్య అవగాహన ఉందనే సంగతి బయటపడిందని అన్నారు. పార్లమెంటు లోపల, బయటా తెదేపా సభ్యులు ఆందోళన చేస్తే వాటిని డ్రామాలని అంటున్న జగన్మోహన్ రెడ్డే ప్రత్యేక హోదా పేరుతో డ్రామాలాడుతూ ప్రజలని వంచిస్తున్నారని విమర్శించారు.
ఏపి బంద్ విఫలం అయ్యిందని తెదేపా, విజయవంతం అయ్యిందని వైకాపా వాదించుకొంటున్నాయి. ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి బంద్ నిర్వహిస్తే అది విజయవంతం అవుతుందని వేరేగా చెప్పనవసరం లేదు. ఏపిలో నిన్న 2,539 బస్సులు తిరుగలేదని, విద్యా, వ్యాపార సంస్థలు మూతపడటం వలన రాష్ట్రానికి చాల నష్టం వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా నిన్న చెప్పారు. అంటే బంద్ విజయవంతం అయ్యిందని ఆయనే దృవీకరిస్తున్నారన్న మాట. కనుక బంద్ విఫలం అయ్యిందని యనమల చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. కానీ ఈ బంద్ నిర్వహించడం వలన రాష్ట్రానికి చాలా నష్టం జరిగిందనే ముఖ్యమంత్రి మాటలు నూటికి నూరు శాతం నిజమని అంగీకరించక తప్పదు.
ఈ బంద్ తో మంత్రి యనమల కనిపెట్టిన తల్లీపిల్ల కాంగ్రెస్ అనుబందం కూడా కొత్త విషయమేమీ కాదు. రాష్ట్ర విభజన కారణంగా రాష్ట్రంలో తుడిచిపెట్టుకు పోయిన కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవడానికి గత రెండేళ్లుగా చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అందుకే మరో ఆలోచన లేకుండా జగన్ కి మద్దతు ఇచ్చింది.
ప్రత్యేక హోదా కోసం తెదేపా ఎంపిలు మాత్రమే కాదు వైకాపా ఎంపిలు కూడా పార్లమెంటు లోపలా బయటా ఆందోళనలు చేస్తున్నారు. ఒకవేళ తెదేపా ఆడుతున్నవి నాటకాలు అని వైకాపా ఆరోపిస్తే, వైకాపా ఆడుతున్నవి కూడా నాటకాలే అవుతాయి. తెదేపా, వైకాపా, కాంగ్రెస్ మూడూ ప్రత్యేక హోదా కోసమే పార్లమెంటు లోపలా బయటా పోరాడుతున్నప్పటికీ, ఎన్నడూ కలిసి పోరాడవు. ఎవరి పోరాటం వారిదే. అందుకే డిల్లీ పలకులకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, పార్టీలు అంటే అంత చులకన.