భారతీయ జనతా పార్టీ ఏపీకి అన్యాయం చేస్తోందని… ఆ పార్టీపై పోరాడితే ప్రజలు మద్దతుగా ఉంటారని ఆశపడి.. మొత్తానికే మోసం తెచ్చుకున్న తెలుగుదేశం పార్టీ.. ఇప్పుడు ఓటమి నుంచి పాఠాలు నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పార్టీ మహానాడులోని రాజకీయ తీర్మానంలో.. కేంద్రానికి అంశాల వారీ మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. కరోనా విషయంలో కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలమయిందని విమర్శలు వస్తున్న తరుణంలో… కేంద్రంపై పల్లెత్తు మాట అనకుండా.. అంశాల వారీ మద్దతిస్తామని ప్రకటించడం ద్వారా.. టీడీపీ తన రాజకీయ వ్యూహాన్ని .. గోడమీద పిల్లి అనే పద్దతిలో ఉంచుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.
తెలుగుదేశం పార్టీ చేసిన రాజకీయ తీర్మానంపై సహజంగానే ఇతర పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. టీడీపీతో కలిసి పలు రాజకీయ పోరాటాలు చేస్తున్న కమ్యూనిస్టులు… రాజకీయ తీర్మానంపై మండిపడ్డారు. అంశాల వారీ మద్దతంటే ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక వైసీపీనేతలు తీవ్ర స్థాయిలో ఎదురుదాడి చేస్తున్నారు. మళ్లీ బీజేపీని మచ్చిక చేసుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని వారు విమర్శలు ప్రారంభించారు. అయితే.. తాము అంశాల వారీగా మద్దతిస్తామని..ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు వ్యతిరేకిస్తామని టీడీపీ చెబుతోంది. నిజానికి…గత రెండేళ్ల కాలంలో.. టీడీపీ ఎప్పుడూ బీజేపీని గట్టిగా వ్యతిరేకించలేదు. పార్లమెంట్లో పెట్టిన బిల్లుల్ని కూడా.. వ్యతిరేకించలేదు. పరోక్షంగా అయినా సహకరించారు.
తెలుగుదేశం పార్టీ ఇప్పుడు సంధి కాలంలో ఉంది. బీజేపీతో గొడవలు పెట్టుకుంటే …పార్టీని కాపాడుకోలేమన్న అంచనాలో ఉన్నారు. తెలంగాణలో కేసీఆర్ కూడా.. అదే భావనతో ఉన్నారు. పార్టీని కాపాడుకోవాల్సి ఉందన్న కారణంతో బీజేపీతో అగ్రెసివ్‌గా పోవడం లేదు. చంద్రబాబు కూడా అదే బాటలో ఉన్నారు. విమర్శలు ఎదురైనా.. అదేపద్దతిలో ఉండాలని నిర్ణయించుకున్నారు. ఏపీ రాజకీయాల్లో కులపరంగా విడిపోయిన సమీకరణాల వల్ల… వచ్చే ఎన్నికల నాటికి.. మిత్రుల్నిచేర్చుకోక తప్పని పరిస్థితి టీడీపీది. అదే వ్యూహం ప్రకారం… వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. విమర్శలు ఎదురైనా బీజేపీకి తాము దగ్గరే అని టీడీపీ నిరూపించాలని అనుకుంటోంది.