తెలుగుదేశం పార్టీని ధిక్కరించి వైసీపీలో అధికారికంగా చేరకపోయినా అనుబంధ సభ్యులుగా మారిపోయిన ముగ్గురు ఎమ్మెల్యేలకు మొదటి సారి విషమ పరీక్షరాజ్యసభ ఎన్నికల రూపంలో ఎదురు కాబోతోంది. శుక్రవారం..రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. నాలుగు స్థానాలకు ఐదుగురు సభ్యులు పోటీ పడుతున్నారు. బలం లేకపోయినా టీడీపీ వర్ల రామయ్యను అభ్యర్థిగా నిలిపింది. దీంతో తెలుగుదేశం పార్టీ విప్ జారీ చేసింది. ఇప్పుడు తప్పని సరిగా ఆ ఎమ్మెల్యేలు…టీడీపీ విప్ కు అనుగుణంగా.. వర్ల రామయ్యకు ఓటు వేయాల్సి ఉంటుంది.
ఒక్కో రాజ్యసభ అభ్యర్థికి 34 ఓట్లు వస్తే విజయం సాధిస్తారు. తెలుగుదేశం బలం 23… అందులో ముగ్గురు వైసీపీ గూటికి చేరారు. పార్టీని ధిక్కరించిన ఆ ముగ్గురిపై అనర్హతా వేటు వేయడానికి ఇంతకు మించిన మార్గం దొరకదని టీడీపీ భావించినట్లుగా కనిపిస్తోంది. అందుకే విప్ జారీ చేశారు. ఓటింగ్ కు గైర్హాజర్ అయినా విప్ ధిక్కరించినట్లే. వ్యతిరేకంగా ఓటు వేసినా విప్ ధిక్కరించినట్లే. నిజానికి టీడీపీ అభ్యర్థికి ఆ ముగ్గురు ఓటు వేయడం వల్ల.. వారికి పోయేది ఏమీలేదు..వైసీపీకి జరిగే నష్టం ఏమీ లేదు. కానీ పార్టీని ధిక్కరించి వెళ్లిపోయిన తరవాత ఆ పార్టీ అభ్యర్థికి ఎలా మద్దతిస్తారనేది ఇప్పుడు..కీలకంగా మారింది.
ఇప్పటికిప్పుడు వారు అనర్హతా వేటు పడకుండా తప్పించుకోవాలన్నా..వివాదాస్పదం కాకుండా.. ఉండాలన్నా… టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయడమే మంచిదని భావిస్తున్నారు. వైసీపీ తరపున నలుగురు సభ్యుల ఎంపిక లాంఛనమే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో 151 మందికిపైగా ఎమ్మెల్యేలు ఉండటం వారిలో చాలా మంది రాజ్యసభ ఎన్నికలకుకొత్త కావడంతో.. మాక్ పోలింగ్‌లోనే పలువురు తడబడుతున్నారు. ఈ టెన్షన్ కూడా వైసీపీకి కల్పించినట్లు అవుతుందని టీడీపీ నేతలు అనుకుంటున్నారు.